Bhagat Singh : భగత్‌సింగ్.. ఈపేరు వినగానే యావత్ భారతీయులకు దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆయన మన దేశం కోసం చేసిన త్యాగం ఎనలేనిది. భారతీయులంతా గర్వించే ఆ మహా యోధుడి వర్ధంతి ఈరోజే(మార్చి 23). బ్రిటీష్ వాళ్లు ఆ రోజు ఎంతో క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించారు. 1931 మార్చి 23న భగత్‌సింగ్, ఆయన సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీశారు. దేశంపై భక్తి అంటే ఏమిటో ఈ ముగ్గురు యోధులు సగర్వంగా చాటి చెప్పారు. అందుకే ఈ రోజును మన దేశంలో ‘అమరవీరుల దినోత్సవం’(Martyrs’ Day)గా జరుపుకుంటారు.
Also Read :Araku Coffee : పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్.. ఎందుకు ? ప్రత్యేకత ఏమిటి ?
భగత్ సింగ్ జీవిత విశేషాలు..
- భగత్ సింగ్(Bhagat Singh) 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఖత్కర్ కలాన్ గ్రామంలో జన్మించారు.
- ఆయన తల్లిదండ్రుల పేర్లు కిషన్ సింగ్, విద్యావతి.
- భగత్ సింగ్ తాతయ్య అర్జున్ సింగ్.. స్వామి దయానంద సరస్వతికి సన్నిహిత అనుచరుడు. తాతయ్య జీవితంతో భగత్ చాలా ప్రభావితులు అయ్యారు.
- భగత్ సింగ్ 3 సంవత్సరాల వయసులో పొలంలో గడ్డిపరకలు నాటుతూ.. ‘‘ తుపాకులు నాటుతున్నాను. చెట్టు పెరిగి తుపాకులు కాస్తాయి. మొలకలు వేసి తుపాకులను మొలకెత్తించాలి’’ అని పేర్కొన్నారట. ఇది ఆయన వ్యక్తిత్వానికి మచ్చుతునక.
- భగత్ సింగ్ బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ అమరులయ్యారు. ఆ సందర్భంగా కన్నీరు పెడుతున్న తన చిన్నమ్మను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్.. ‘పిన్ని ఏడవొద్దు.. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అని చెప్పారట.
- 13 ఏళ్ల వయసులో ఉండగా మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంతో భగత్ సింగ్ ప్రభావితులు అయ్యారు.
- బాల్యం నుంచే బ్రిటీష్ వాళ్లపై భగత్ సింగ్‌కు తీవ్ర ద్వేషం ఉండేది.
- భారత స్వాతంత్య్ర సాధన కోసం విప్లవ పోరాటం కూడా అవసరం అని భగత్ సింగ్ వాదించేవారు.
- 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతం అనేది భగత్ సింగ్‌లో బ్రిటీష్ వారిపైకోపాన్ని పెంచింది.
- యుక్త వయసుకు వచ్చాక భగత్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే .. ‘‘నా జీవితం దేశానికి అంకితం. నాకు ఇంకే కోరిక లేదు’’ అని ఉత్తరం రాసి భగత్ సింగ్ ఇంటి నుంచి పారిపోయారట.
- ఇంటి నుంచి పారిపోయాక నవ జవాన్ భారత సభ అనే సంఘంలో భగత్ చేరారు. అనంతరం హిందూస్థాన్ గణతంత్ర సంఘంలో చేరారు. అక్క ఆయనకు సుఖ్‌దేవ్ పరిచయమయ్యారు. ఈ ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులు అయ్యారు.
- స్వాతంత్య్ర ఉద్యమకారులు సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని నిర్వహించారు. సైమన్ కమిషన్‌ను తీవ్రంగా అడ్డుకున్నారు. లాహోర్‌లో లాలా లజపతి రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. ఈక్రమంలో బ్రిటీష్ పోలీసు సూపరింటెండెంట్ సాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్‌పై దాడి చేశాడు. దీంతో లాలా లజపతిరాయ్ నేల కొరిగారు. ఆయన మరణం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులలో ఆగ్రహాన్ని పెంచింది.
- ఈ ఘటన తర్వాత భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులు.. సాండర్స్‌ను కసి తీరా కాల్చి చంపారు.
- 1929లో పార్లమెంటుపైకి భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులు బాంబులు విసిరారు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. వారిపై బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపింది. ఉరిశిక్ష విధించింది.