Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశాన్ని దుఃఖంలో ముంచింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు 18 ఏళ్ల తర్వాత విజయాన్ని నమోదు చేయగా, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ ఆనంద వేళ తీవ్ర విషాదానికి దారితీసింది. జూన్ 3న నిర్వహించిన విజయోత్సవ పరేడ్ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల అనుమతి లేకుండానే కార్యక్రమం?
ఈ విషాద ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా, ఆర్సీబీ యాజమాన్యం ముందుగా పోలీసులను సంప్రదించకుండా, స్వయంగా తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విజయోత్సవ పరేడ్ ప్రకటన చేసినట్లు పేర్కొంది. ఇక ముఖ్యంగా, ఈ ప్రకటనల్లో విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్న వీడియోలను ప్రచురించడం వల్ల మరింత ఆసక్తి కలిగిన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్లు సమాచారం.
కోర్టు గోప్యత తిరస్కరణ
ఈ నివేదికను రహస్యంగా ఉంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది ఇలాంటి ఘటనల్లో ప్రజల ప్రాణాలు పోయినప్పుడు గోప్యతకు చట్టపరమైన ఆధారం ఉండదు అని పేర్కొంటూ, నివేదికను అందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అనుమతుల్లేని వేడుకలు – నిర్లక్ష్యం వెలుగు
నివేదిక ప్రకారం, జూన్ 3న జరిగే పరేడ్‌కు సంబంధించి ఆర్సీబీ కేవలం సమాచారం మాత్రమే ఇచ్చినట్లు పేర్కొంది. ఫార్మల్ అనుమతుల కోసం దరఖాస్తు చేయకపోవడమే కాక, కనీసం ఏడు రోజుల ముందు అనుమతుల కోసం అప్లై చేయాల్సిన నిబంధనను కూడా పాటించలేదని నివేదికలో నిగ్గు తీశారు. అదే రోజు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) కూడా అదే విషయంపై దరఖాస్తు చేసిందని, దానిని తిరస్కరించామని పోలీసులు తెలిపారు.
విరాట్ కోహ్లీ వ్యాఖ్యల ప్రభావం
ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా వేసిన పోస్టులో, “ఈ విజయాన్ని బెంగళూరు ప్రజలతో పంచుకోవాలని ఉంది,” అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలతో కూడిన వీడియోను పోస్టు చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఉచిత ప్రవేశమని ప్రకటించడంతో, స్టేడియం సామర్థ్యానికి మించి, సుమారు 3 లక్షల మంది చేరుకున్నారు. స్టేడియం చుట్టూ 14 కిలోమీటర్ల మేర ప్రజలు గుమిగూడారు.
గందరగోళానికి దారితీసిన వ్యవస్థాపక లోపాలు
ప్రమాదం జరిగిన కారణాల్లో ఒకటి – ఎంట్రీ పాస్‌ల వ్యవహారం. ప్రజలు స్టేడియం వద్ద చేరిన తర్వాతే నిర్వాహకులు ఎక్స్ ఖాతా ద్వారా “పాస్‌లు తప్పనిసరి” అని ప్రకటించారు. దీనివల్ల అక్కడ ఉన్నవారు అయోమయానికి గురయ్యారు. గేట్లు తెరవడంలో సమన్వయం లేకపోవడం, ముందస్తు ప్రణాళికల యొక్క లోపాలు, మౌలిక ఏర్పాట్ల యొక్క అజాగ్రత్తత వల్లే తొక్కిసలాటకు దారితీసింది.
పోలీసుల అప్రమత్తతా, పరిష్కార యత్నాలు
గేట్లు 1, 2, 21 వద్ద భారీగా జనసంద్రం ఏర్పడగా, ప్రజలు లోపలికి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు అప్రమత్తమై ఉద్రిక్తతను నియంత్రించారు. తొక్కిసలాట దృష్ట్యా, పూర్తి వేడుకను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నా, అధికారులు చివరికి కార్యక్రమ పరిమాణాన్ని తగ్గించి కొనసాగించారు. ఘటనకు కారణమైన ఘోర నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం నివేదికలో స్పష్టంగా వెల్లడించడంతో, ఇప్పుడిది రాజకీయంగా, న్యాయపరంగా దుమారం రేపుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పౌరసమాజం కోరుతోంది.
Read Also: Amarnath Yatra : భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత