Battle of Former Couple : వాళ్లు మాజీ భార్యాభర్తలు. ఈసారి ఒకే లోక్‌సభ స్థానం నుంచి తలపడనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఉన్న బిష్ణుపూర్ లోక్‌సభ స్థానంలో ఈ విచిత్రమైన రాజకీయ పోరు జరగనుంది. బిష్ణుపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే సౌమిత్ర ఖాన్ పేరును బీజేపీ ప్రకటించింది. ఇక మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తాజాగా విడుదల చేసిన లిస్టులో సౌమిత్ర ఖాన్ మాజీ భార్య సుజాత మండల్ పేరు ఉంది. దీంతో బిష్ణుపూర్‌లో మాజీ భార్యాభర్తల పోటీకి రంగం సిద్ధమైంది. సుజాత మండల్ ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ దఫా సుజాతను లోక్‌సభకు పంపాలని దీదీ నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join
సౌమిత్ర ఖాన్ తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సుజాత మండల్‌ను 2010లో పెళ్లి చేసుకున్నారు. మొదట టీఎంసీలో ఉన్న సౌమిత్ర ఖాన్, 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. అదే సమయంలో సౌమిత్ర తరఫున సుజాత కూడా ప్రచారం చేశారు. 2021 సంవత్సరంలో టీఎంసీ పార్టీలో సుజాత చేరారు. దీంతో అసహనానికి గురైన సౌమిత్ర కెమెరా ముందే సుజాతతో విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇటీవల బీజేపీ, టీఎంసీ వీరిని ఒకే స్థానం నుంచి బరిలోకి దింపాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ మాజీ భార్యభర్తల(Battle of Former Couple) పోటీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : Electoral Bonds : మార్చి 12లోగా ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చండి.. ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
టాలీవుడ్ నటికి హుగ్లీ పార్లమెంట్ టికెట్
- ఇద్దరు క్రికెటర్లు యుసుఫ్ పఠాన్, కీర్తి ఆజాద్ లకు పార్లమెంట్ టికెట్ ఇచ్చిన మమతా…టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన రచనా, బాలీవుడ్ హీరో శత్రుగణ్ సిన్హాకు ఛాన్స్ ఇచ్చారు.
- టీమిండియా మాజీ ప్లేయర్ యుసుఫ్ పఠాన్ కు బెర్హంపూర్ పార్లమెంట్ టికెట్‌ను దీదీ కేటాయించారు.
- అసన్ సోల్ నుంచి శత్రుఘన్ సిన్హా, బెర్హంపూర్ నుంచి యుసుఫ్ పఠాన్, బసిరత్ నుంచి హజి నురులు ఇస్లాం, బుర్ద్వాన్ దుర్గాపూర్ నుంచి మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్, జాదవ్ పూర్ నుంచి సయాని ఘోష్, మేదినిపూర్ నుంచి జూన్ మాలియా, క్రిష్ణానగర్ నుంచి మహువా మెయిత్రా, తమ్లుక్ నుంచి దేబాన్షు భట్టాచార్యను టీఎంసీ బరిలోకి దించింది.
- రచనా బెనర్జీ…హుగ్లీ పార్లమెంట్ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీ చేయనున్నారు. తెలుగు, బెంగాళీ, ఓడియా, హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు.
- రచనా తెలుగులో నేను ప్రేమిస్తున్నాను, రాయుడు, అభిషేకం, అంతా మనమంచికే, సుల్తాన్, బావగారు బాగున్నారా?, కన్యాదానం, మావిడాకులు చిత్రాల్లో నటించారు. సిద్దాంత మహాపాత్ర సరసన 40 సినిమాలు, ప్రసేన్ చటర్జీతో కలిసి 35 సినిమాల్లో నటించారు.