Money Laundering Case : మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సత్యేంద్ర జైన్‌కు బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించిన సమయంలో కోర్టులోనే ఉన్న ఆయన భార్య భావోద్వానికి గురై కంటతడి పెట్టారు.
”విచారణలో జరుగుతున్న జాప్యం, 18 నెలల పాటు నిర్బంధంలోనే ఉంచడం వల్ల నిందితుడికి ఉపశమనం కలిగించడమే సబబని కోర్టు భావిస్తోంది” అని ప్రత్యేక న్యాయమూర్తి విషాల్ గాగ్నే తీర్పునిచ్చారు. సత్యేంద్ర జైన్‌కు కోర్టు బెయిలు మంజూరు చేస్తూ, సాక్ష్యులను కలవడం కానీ, విచారణను ప్రభావితం చేయడం కానీ, దేశం విడిచిపెట్టి వెళ్లడం కానీ చేయరాదని షరతులు విధించింది. తనకు సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు సత్యేంద్ర జైన్ పాల్పడ్డారంటూ 2022 మే 30న ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు.. షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. ఈ హవాలా కేసును దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే సత్యేందర్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో వైద్య కారణాలతో గత ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. అయితే రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తిరిగి మళ్లీ తిహాడ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. దిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్ వంటి ముఖ్య నేతలు కొన్ని నెలల పాటు జైలులో ఉండగా.. ఇటీవల వారికి ఊరట లభించిన సంగతి తెలిసిందే. దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గత నెల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో 17 నెలల పాటు జైల్లో ఉన్న దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాకు కూడా కొద్దినెలల క్రితం బెయిల్ లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సత్యేందర్ జైన్‌కు బెయిల్ రావడంతో ఆప్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Read Also: Gautam Adani 100 Crores: తెలంగాణ కోసం రూ. 100 కోట్ల విరాళం ప్రకటించిన అదానీ