Baba Balak Nath : ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ మరో యోగి సీఎం అవుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని తిజారా అసెంబ్లీ స్థానం ఆధ్యాత్మిక గురువు బాబా బాలక్‌నాథ్ గెలిచారు. ఇంతకుముందు వరకు ఈయన ఆల్వార్ ఎంపీగానూ పనిచేశారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో ఈయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా బాబా బాలక్‌నాథ్ సన్నిహితుడు. బాలక్‌నాథ్ తరఫున యోగి ఆదిత్యనాథ్ ప్రచారం కూడా చేశారు. దీంతో ఈసారి రాజస్థాన్ సీఎం రేసులో ఆయన కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
40 ఏళ్ల బాలక్‌నాథ్.. ఆదిత్యనాథ్‌లా నాథ్ సంప్రదాయానికి చెందినవారు. బెహ్రోడ్‌లోని ఓ గ్రామంలో 1984లో యాదవ కుటుంబంలో ఈయన జన్మించారు. 12వ తరగతి వరకూ చదివారు. రోహ్‌తక్‌లోని మస్త్‌నాథ్ మఠానికి బాలక్‌నాథ్ ఎనిమిదో మహంత్. నాథ్ సంప్రదాయానికి చెందిన అతి పెద్ద మఠాల్లో ఇది ఒకటి. ఈ మఠం విద్యా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తుంటుంది. తన ఖాతాలో రూ.12 లక్షలే ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తిజారాలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్‌ఖాన్ అనే అభ్యర్థి ఆయనపై పోటీ చేశారు. పార్టీ సీనియర్ నేతలు మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లను కూడా సీఎం పోస్టు కోసం బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తోంది. ‘‘రాజస్థాన్ సీఎంగా బరిలో మీరు ఉంటారా?’’ అని బాలక్‌నాథ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘బీజేపీకి ప్రాణాధారమైన మోడీ కింద పనిచేయడానికి నేను ఇష్టపడతాను. సీఎం ఎవరు అన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు.
Also Read: Doctor MLAs : తెలంగాణ అసెంబ్లీలోకి 16 మంది డాక్టర్లు
బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేశారు. అయితే ఆమెను మూడోసారి సీఎంగా చేసేందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా లేదు. గజేంద్ర సింగ్ షెకావత్ ప్రస్తుత సీఎం గెహ్లాట్ ప్రాతినిధ్యం వహిస్తున్న జోధ్‌పూర్‌కు చెందినవారు. దీంతో ఆయన కూడా బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. ఇక రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఎంపీ దియా కుమారి పేరు కూడా ఈ లిస్టులో ఉందని తెలుస్తోంది. వసుంధరకు ఈమె ప్రత్యామ్నాయం అవుతారని బీజేపీ పెద్దలు(Baba Balak Nath) భావిస్తున్నారట.