దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రామ మందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. సుమారు 1800 కోట్ల ఖర్చుతో ఈ ఆలయ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆలయం మొదటి దశ పనులు జరుగుతున్నాయి. ఈ తొలిదశ నిర్మాణ పనులను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని రామమందిర నిర్మాణ కమిటీ భావిస్తోంది. ఆ మేరకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పలు విషయాలను వెల్లడించారు.
ఈ ఏడాది డిసెంబర్ 30నాటికి మొదటి దశ రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మిస్తున్నారట. మొదటి దశ పూర్తయిన తర్వాతే భక్తులకు ఆలయ ప్రవేశం ఉంటుందట. ఇక మరో ఏడాదిన్నర కాలంలో అంటే 2024 డిసెంబర్ 30 నాటికి 1వ, 2వ అంతస్థులు పూర్తిచేసేందుకు నిర్ణయించినట్లు నృపేంద్ర మిశ్రా చెప్పారు. మొదటి దశలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఐదు మండపాలు, గర్భగుడి, విగ్రహ ప్రతిష్టాపన ఇతర పనులు పూర్తి చేయనున్నారు. ఐదు మండపాల నిర్మాణంలో దాదాపు 160 పిల్లర్లు ఉన్నాయి. పిల్లర్లపై శిల్పాలు, చిత్రాలు చిహ్నాలపని పూర్తి చేయాలని నృపేంద్ర మిశ్రా చెప్పారు.
ఆలయ దిగువ పీఠంపై శ్రీరాముని సంక్షిప్త వివరణ ప్రారంభించబడుతుందని, విద్యుత్ సౌకర్యం, ఇతర సౌకర్యాల పనులు మొదటి దశలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. ఆలయ బయటి ప్రాంగణం సహా మొదటి, రెండవ అంతస్తులు 2024 డిసెంబర్ 30 నాటికి పూర్తవుతాయని అన్నారు. 2025 డిసెంబర్ నాటికి పూర్తి ఆలయ సముదాయం సిద్ధం అవుతుందని నృపేంద్ర మిశ్రా అన్నారు.