Ayodhya – BJP : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయోధ్య రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 15 రోజుల పాటు వేడుకగా నిర్వహించాలని బీజేపీ యోచిస్తోందని అంటున్నారు. ఇందుకోసం ఈ నెల 14 నుంచి 27 వరకు షెడ్యూల్‌ను బీజేపీ ఖరారు చేసిందని సమాచారం. ఈ వ్యవధిలో ప్రతి ఇంటా రామ జ్యోతులను వెలిగించడం, దేశవ్యాప్తంగా ఆలయాలను శుభ్రపర్చడం, భక్తులు అయోధ్య వెళ్లేందుకు సహకరించడం వంటి కార్యక్రమాలను కమలదళం చేపట్టనుందని తెలుస్తోంది. ఈనెల 22వ తేదీన సాయంత్రం దీపావళి తరహాలో ప్రతి ఇంట్లో రామ జ్యోతులను వెలిగించాలని బీజేపీ కోరుతోంది. దీనిపై ఇంటింటా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయనున్నారు. ఈవిషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ(Ayodhya – BJP) కూడా ఇటీవల ఓ సభలో ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
జనవరి 25 నుంచి మార్చి 25 వరకు అయోధ్య రామమందిరాన్ని సందర్శించే రామభక్తులకు బీజేపీ కార్యకర్తలు సహాయం చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత రోజూ 50 వేల మంది భక్తులు రామున్ని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. వారి ప్రయాణం, వసతి సౌకర్యాలు, ఇతర అంశాల్లో భక్తులకు బీజేపీ కార్యకర్తలు సాయం చేయనున్నారట. ఈ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు కలిసి పాల్గొంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ జెండాలను కార్యకర్తలు ఉపయోగించరాదని బీజేపీ అధిష్ఠానం ఆదేశించిందని చెబుతున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సీనియర్ నేతలు మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపైనా చర్చించారు.రామాలయ ప్రారంభోత్సవం అనంతరం అయోధ్యను సందర్శించే భక్తులకు బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ సాయం చేయాలనే నిర్ణయాన్ని ఈ మీటింగ్‌లోనే తీసుకున్నారని అంటున్నారు.