Fake Voters: రాజస్థాన్ పంచాయితీ రాజ్ ఎన్నికల సన్నాహాల వేళ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఒక కఠినమైన ఆదేశం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రాజస్థాన్ పంచాయితీ ఎన్నికల్లో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేయడానికి వచ్చే ముసుగు లేదా బుర్కా ధరించిన మహిళా ఓటర్లు, ఓటు వేయడానికి ముందు తమ ముఖాన్ని చూపించి గుర్తింపును ధృవీకరించుకోవాలి. నిష్పక్షపాత ఎన్నికలకు ఓటరు సరైన గుర్తింపు తప్పనిసరని కమిషన్ స్పష్టం చేసింది.
ప్రభుత్వ వాదన- ఉద్దేశం
రాజస్థాన్ స్వయంప్రతిపత్తి పాలన శాఖ మంత్రి ఝబ్బర్ సింగ్ ఖర్రా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. గత కొన్ని ఎన్నికలలో ముసుగు లేదా బుర్కా మాటున ఫేక్ ఓటింగ్ (దొంగ ఓట్లు) జరుగుతున్నట్లు గమనించామని ఆయన తెలిపారు. దీనిని అరికట్టడానికే ఈ నిబంధన తెచ్చామని, అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖలో పనిచేసే మహిళా సిబ్బంది ద్వారా ఈ గుర్తింపు ప్రక్రియను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read: 2026లో కూడా భారత్- పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!
కాంగ్రెస్ అభ్యంతరం, ఆందోళన
ఈ నిబంధనపై కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్ మహిళా కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సారికా సింగ్ మాట్లాడుతూ.. ఈ నిబంధన రాజ్యాంగంలోని అధికరణ 14, 15 (వివక్షకు వ్యతిరేక హక్కు)ను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ఎన్నికల విధులకు మహిళా సిబ్బందిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలనే మరో ప్రతిపాదనను కూడా ఆమె తప్పుపట్టారు. ఇది మహిళలను తక్కువ చేసి చూడటమేనని, వెంటనే ఈ నిబంధనలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ముసుగు లేకుండా బయటకు రావడం కష్టమని, ఈ నిబంధన వల్ల చాలామంది ఓటు వేయడానికి రాకపోవచ్చని కాంగ్రెస్ వాదిస్తోంది.
కొత్త నిబంధన అమలు ఎలా ఉంటుంది?
ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు. మహిళా సిబ్బంది సమక్షంలో ముసుగు తొలగించి గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాతే ఓటు వేయడానికి అనుమతిస్తారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసే బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం అధికార పక్షం (బీజేపీ) పారదర్శకత పేరుతో ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, విపక్షం (కాంగ్రెస్) దీనిని మహిళల హక్కులకు భంగమని పోరాడుతోంది.
