Atishi No 1 : సీఎం పదవిని ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి చేపట్టిన నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ సీటింగ్‌లో పలు కీలక మార్పులు జరిగాయి. సీఎం పదవిలో ఉండేవారికి 1వ నంబరు సీటును కేటాయించడం అనేది అసెంబ్లీ సంప్రదాయం. ఇందులో భాగంగా 1వ నంబరు సీటును సీఎం అతిషికి(Atishi No 1) కేటాయించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ తన 1వ నంబరు సీటును కోల్పోయారు. ఆయనకు 41వ నంబరు సీటును కేటాయించారు. ఆ సీటులోనే ఆయన కూర్చోనున్నారు. ఇంతకుముందు వరకు అతిషి 19వ నంబరు సీటులో కూర్చునేవారు. ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, ముకేశ్ అహ్లావత్‌ల సీటు నంబర్లు కూడా మారాయి. బీజేపీ నేత, ఢిల్లీ అసెంబ్లీ విపక్ష నాయకుడు విజేందర్ గుప్తా సీటును 94వ నంబరు నుంచి 100వ నంబరుకు మార్చారు.
Also Read :Bikini – Island : భార్యను బికినీలో చూసేందుకు.. రూ.418 కోట్లతో దీవినే కొనేశాడు
రేపు అతిషి విశ్వాస పరీక్ష
ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. కాగ్ నివేదికలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్ సాయంతో వారిని అసెంబ్లీ నుంచి బయటికి పంపారు. సభా కార్యకలాపాలకు బీజేపీ ఎమ్మెల్యేలు అవాంతరం కలిగించడంతో సెషన్‌ను 15 నిమిషాల పాటు స్పీకర్ రాంనివాస్ గోయల్ వాయిదా వేశారు. మళ్లీ కాసేపటి తర్వాత అసెంబ్లీ సెషన్ మొదలుకానుంది. ఇక రేపు (శుక్రవారం) కూడా ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. శుక్రవారం రోజు సీఎం అతిషి విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. సభలో ఆప్ ఎమ్మెల్యేల బలం ఎంత ఉందనేది రేపు తేలిపోనుంది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 59 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీ వద్ద కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు లక్ష్యంగా సీఎం అతిషి సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. తాజాగా బుధవారం రోజు కార్మికుల కనీస వేతనాలను పెంచింది. ఈ అసెంబ్లీ సెషన్‌లో అలాంటి మరిన్ని ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.