Site icon HashtagU Telugu

Bus Accident : లోయలో పడిపోయిన బస్సు.. 36 మంది మృతి.. 24 మందికి గాయాలు

Bus Falls Into Gorge Uttarakhands Almora

Bus Accident : ఓవర్‌ లోడ్‌ కారణంగా బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు చనిపోగా, మరో 24 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయాలపాలైన వారిని ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలని ఉత్తరాఖండ్‌ (Bus Accident) సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదేశించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన  ప్రాంతానికి సంబంధించిన రోడ్డు రవాణా అధికారులను(ఆర్‌టీఓ) సస్పెండ్ చేయాలని సీఎం ధామి ఆదేశాలు జారీ చేశారు.  చనిపోయిన వారి కుటుంబాలకు చెరో రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున సాయం చేస్తామన్నారు.ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని ధామి పేర్కొన్నారు.

Also Read :Rafael Nadal Academy : రాకెట్ పవర్.. ‘అనంత’లోని నాదల్‌ టెన్నిస్ స్కూల్ విశేషాలివీ..

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి బస్సు లోయలోకి పడిపోయినట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ నుంచి కుమావున్‌ వైపు వెళ్తున్న బస్సు అల్మోరా జిల్లా మార్చులా ప్రాంతం వద్ద లోయలో పడిపోయింది. సంఘటనా స్థలంలో రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రమాదానికి గురైన ఈ బస్సు కెపాసిటీ 43. అంటే అందులో గరిష్ఠంగా 43 మంది మాత్రమే ప్రయాణించాలి. కానీ ఏకంగా 60 మందితో ప్రయాణించడం వల్ల.. బస్సుపై డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో అది లోయలోకి దూసుకెళ్లి పడిపోయింది. ఓవర్ లోడ్ సరుకులు, ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను మనం నిత్యం చూస్తుంటాం. వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన బాధ్యత రోడ్డు రవాణా అధికారులపై ఉంటుంది. అయితే వారు ఈ విషయంపై పెద్దగా  శ్రద్ధ పెట్టకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

Also Read :Temperatures Falling : పడిపోతున్న టెంపరేచర్స్.. పెరుగుతున్న చలి.. అక్కడ మైనస్ 50 డిగ్రీలు