Site icon HashtagU Telugu

Advani – Ram Mandir : రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దు.. అద్వానీ, జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి

Advani Ram Mandir

Advani Ram Mandir

Advani – Ram Mandir : అయోధ్యలో రామమందిరం కోసం 1980వ దశకం నుంచి జరిగిన ఆందోళనలలో ముందంజలో నిలిచిన బీజేపీ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. మరో నెల రోజుల్లో (జనవరి 22న) అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగబోతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు అయోధ్య రామమందిర ఆందోళనలలో పాల్గొన్న ముఖ్య నేతలంతా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరవుతారని అందరూ భావించారు. కానీ అలా జరగడం లేదు. ప్రస్తుతం ఎల్‌కే అద్వానీ(Advani – Ram Mandir) వయసు 96 సంవత్సరాలు, మురళీ మనోహర్ జోషి వయసు 89 సంవత్సరాలు. ‘‘వయోభారం దృష్ట్యా వారిద్దరిని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దని అభ్యర్థించాం. దానికి ఇద్దరూ అంగీకరించారు’’ అని రామ్ టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరులకు  వెల్లడించారు. మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి వేడుకలకు ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆరు దర్శనాల శంకరాచార్యులు, దాదాపు 150 మంది సాధువులు, ఋషులు ఈ వేడుకలలో పాల్గొంటారని చంపత్ రాయ్ తెలిపారు.  దాదాపు 4,000 మంది సాధువులు, 2,200 మంది ఇతర అతిథులను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. కాశీ విశ్వనాథ్, వైష్ణో దేవి వంటి ప్రధాన ఆలయాల అధిపతులు, మతపరమైన, రాజ్యాంగ సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానించినట్లు ఆయన వివరించారు. ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా, కేరళకు చెందిన మాతా అమృతానందమయి, యోగా గురువు బాబా రామ్‌దేవ్, సినీ తారలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అరుణ్ గోవిల్, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ప్రముఖ చిత్రకారుడు వాసుదేవ్ కామత్, ఇస్రో  డైరెక్టర్ నీలేష్ దేశాయ్‌తో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు రాయ్ తెలిపారు.

Also Read: New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు.. సీఎం రేవంత్ పచ్చజెండా

జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్వయంగా ప్రధాని మోడీ.. రాముడి ప్రతిష్ఠాపన చేయనున్నారు.  జనవరి 16 నుంచి రామమందిరంలో  ‘ప్రాణ ప్రతిష్ఠ’ పూజలు ప్రారంభమై జనవరి 22న రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు కొనసాగుతాయి. జనవరి 23న భక్తుల కోసం ఆలయాన్ని తెరుస్తారు. సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం జనవరి 24 నుంచి 48 రోజుల పాటు ఆచార సంప్రదాయాల ప్రకారం ‘మండల పూజ’ నిర్వహించనున్నారు.