దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల (Bypoll ) కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) షెడ్యూల్‌ను విడుదల చేసింది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్లు మే 28 నుంచి ప్రారంభమై జూన్ 2 వరకు స్వీకరించనున్నారు. జూన్ 5న నామినేషన్ల పరిశీలన, జూన్ 7 వరకు ఉపసంహరణకు గడువు ఉండనుంది.
Fourth Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. టాప్ -10లో ఉన్న దేశాలివీ
ఉప ఎన్నికల పోలింగ్ జూన్ 19న జరగనుంది. అనంతరం జూన్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు మృతిచెందడం, కొందరు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని కడి, విశ్వదర్ నియోజకవర్గాలు, పంజాబ్‌లో లుధియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లో కాలీగంజ్, కేరళలో నిలంబూరు నియోజకవర్గాల్లో ఈ బై ఎలెక్షన్స్ నిర్వహించనున్నారు.
ఈ ఉప ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా కీలకంగా మారాయి. ఖాళీ అయిన స్థానాల్లో ప్రతిష్టాత్మకంగా పోటీకి దిగాలని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యాచరణ మొదలైపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం, ఉప ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్టు పేర్కొంది.