Mizoram : మిజోరం ప్రభుత్వం సామాజిక అభివృద్ధి దిశగా కీలకంగా ముందడుగు వేసింది. రాష్ట్రాన్ని యాచకుల రహిత ప్రాంతంగా మారుస్తూ “మిజోరం యాచక నిషేధ బిల్లు – 2025” ను రూపొందించి అసెంబ్లీకి ప్రవేశపెట్టగా, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారింది సైరంగ్-సిహ్ము రైల్వే ప్రాజెక్టు. త్వరలో ప్రారంభం కానున్న ఈ రైల్వే మార్గం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి యాచకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలు మార్గాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అంతవరకే కాదు, ఈ రైలు ద్వారా వచ్చిన కొత్త సంపర్కంతో మిజోరంలో భిక్షాటన వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఈ చట్టం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Telangana : కుండపోత వర్షాలు..వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒక ప్రత్యేక “రిలీఫ్ బోర్డు”ను మరియు “రిసీవింగ్ సెంటర్”ను ఏర్పాటు చేస్తుంది. పట్టుబడిన యాచకులను ఈ కేంద్రంలో తాత్కాలికంగా ఉంచి, వారి స్వస్థలాలకు లేదా కుటుంబ సభ్యుల వద్దకు 24 గంటల లోపల పంపే ఏర్పాట్లు జరుగుతాయి. వారి అవసరాల్ని గుర్తించి, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లాల్రిన్‌పుయ్ ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో యాచకుల సంఖ్య తక్కువగానే ఉందని, వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలవారేనని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, రాజధాని ఐజ్వాల్‌లో మాత్రమే 30 మందికి పైగా యాచకులు ఉన్నారు. వీరిలో స్థానికులు కంటే బయటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. చర్చిలు, స్వచ్ఛంద సంస్థలు, బలమైన సామాజిక వ్యవస్థ ఉండటంతోనే మిజోరంలో యాచకత్వం పెద్ద సమస్యగా మారలేదని ఆయన వివరించారు.
అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీ ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ నేత లాల్‌చందమ రాల్టే మాట్లాడుతూ..ఈ నిర్ణయం మిజోర రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని, అంతేగాక ఇది క్రైస్తవ మౌలిక విలువలకు విరుద్ధమని విమర్శించారు. సహాయమనేది క్రైస్తవ ధర్మసూత్రాల్లో ఒకటి. బాధితులకు అండగా నిలవడం చర్చిలు, సమాజాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చట్టం అమలు పేరుతో యాచకులపై కఠిన చర్యలు తీసుకోవడం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలపై సీఎం లాల్దుహోమా స్పందిస్తూ, ఈ చట్టం ఉద్దేశ్యం ఎవ్వరినీ శిక్షించడం కాదని స్పష్టం చేశారు. మేము యాచకులను శిక్షించమన్నది కాదు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చర్చిలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పునరావాస కార్యక్రమాలు చేపడతాం. మిజోరాన్ని మరింత అభివృద్ధి చెందిన, గౌరవనీయమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని పేర్కొన్నారు.
Read Also: Rains : తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు