Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమాయక టూరిస్టులు ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. సరదాగా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేద్దామని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పహల్గాంలో ముష్కరులు రక్తపుటేరులు పారించారు. హిందూ పర్యాటకులే లక్ష్యంగా కాల్చి చంపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 28మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. మరోవైపు.. ఉగ్రదాడి నుంచి కొందరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగారు. అలా సురక్షితంగా బయటపడినవారిలో అస్సాంకు చెందిన కుటుంబం ఉంది. గడ్డం కారణంగా ముష్కర్లు ఆ కుటుంబ పెద్దను వదిలేశారు.
Also Read: Pahalgam Attack : బైసరన్ లోయను ఉగ్రవాదులు ఎంచుకోవడానికి కారణాలు ఇవే
పహల్గాంలోని బైసరన్ సమీపంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి నుంచి బయటపడినవారిలో అస్సాం విశ్వవిద్యాలయంలో బెంగాలీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ దేబాసిష్ భట్టాచార్య కూడా ఉన్నారు. ఆయన తనకు ఎదురైన భయంకరమైన క్షణాలను వివరించారు. దేబాసిష్ భట్టాచార్య తన భార్య, కొడుకుతో కలిసి కాశ్మీర్ వెళ్ళాడు. పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఆయన అదే స్థలంలో ఉన్నారు.
Also Read: J&K Terror Attack : ప్రధాన సూత్రధారి ఖలీద్..బ్యాక్ గ్రౌండ్ ఇదే !
నేను నా కుటుంబంతో కలిసి ఒక చెట్టు కింద నిద్రిస్తుండగా అకస్మాత్తుగా నా చుట్టూ పెద్దశబ్దాలు వినిపించాయి. అక్కడివారంతా కల్మా పఠిస్తున్నారు. నేను కూడా దానిని పఠించడం ప్రారంభించాను. కొన్ని క్షణాల తర్వాత, ఉగ్రవాదులలో ఒకరు మా వైపు నడుచుకుంటూ వచ్చి నా పక్కన పడుకున్న వ్యక్తి తలపై కాల్చారు. తర్వాత ఆ ఉగ్రవాది నావైపు తిరిగాడు. అతను నావైపు సూటిగా చూసి, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను ఏమీ మాట్లాడకుండా కల్మా మరింత బిగ్గరగా పఠించాను. దీంతో ఆ ఉగ్రవాది వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడని ప్రొఫెసర్ భట్టాచార్య తెలిపారు.
ఆ తరువాత నేను నిశ్శబ్దంగా లేచి నా భార్య, కొడుకుతో అక్కడి నుంచి పారిపోయాను. మేము కొండపైకి ఎక్కి, కంచె దాటి, దారిలో గుర్రాల డెక్కల గుర్తులను అనుసరిస్తూ దాదాపు రెండు గంటలు నడిచాము. చివరికి, మేము గుర్రంతో ఉన్న ఒక రైడర్‌ను చూసి మా హోటల్‌కు తిరిగి వచ్చామని దేబాసిష్ భట్టాచార్య పేర్కొన్నాడు. ఇదిలాఉంటే.. దేబాసిష్ భట్టాచార్యకు గడ్డం ఉంది. కొంచెం తెల్లంగా.. కొంచెం నల్లగా అచ్చం ముస్లీంలకు ఉన్నట్లుగా గడ్డం ఉంది. దీంతో ఉగ్రవాదులు అతన్ని ముస్లిం అనుకొని వదిలేసి ఉండొచ్చునని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దేబాసిష్ భట్టాచార్య, మధుమితా దాస్ భట్టాచార్య, ద్రౌదీప్ భట్టాచార్య ప్రస్తుతం శ్రీనగర్ లో క్షేమంగా ఉన్నారు.