Operation Sindoor : అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మూదాబాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన హర్యానాలోని సోనీపట్‌లో ఉన్న అశోకా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి. ఇటీవలే భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు వ్యతిరేకంగా ఆయన కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను అలీఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై బీజేపీ యువ మోర్చా నేత ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలో అలీఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read :Hyderabad Fire : హైదరాబాద్‌లో గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన.. ఇలా జరిగింది
అలీఖాన్ ఏమన్నారు ?
‘‘సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌లు జరిగింది జరిగినట్టుగా మీడియాకు చెప్పలేదు. కానీ దేశ ప్రజలు కోరుకున్నది చెప్పారు. ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న వారు క్షేత్ర స్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలి. లేదంటే అది వంచనే’’ అని అలీఖాన్(Operation Sindoor) వ్యాఖ్యానించారు.
మహిళా కమిషన్ నోటీసులు
ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు అలీఖాన్‌కు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేణూ భాటియా మే 12న నోటీసులు పంపారు. ఈ తప్పు చేసినందుకు వెంటనే తమ ఎదుట హాజరై క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌లను చూసి తాము గర్విస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదని అలీఖాన్‌కు హితవు పలికారు.
Also Read :Pakistan Copying : భారత్‌ను కాపీ కొట్టిన పాక్.. ప్రపంచదేశాలకు ‘పీస్ మిషన్’.. భుట్టో సారథ్యం
నోటీసులపై అలీఖాన్ రియాక్షన్
తన వ్యాఖ్యలకు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ వక్రభాష్యం చెప్పిందని అలీఖాన్ ఆరోపించారు. తన వ్యాఖ్యలను తప్పుడు కోణంలో, తప్పుడు ఉద్దేశంతో చదివారని ఆవేదన వ్యక్తంచేశారు.వాటిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. తన మాటల్లోని అర్థాన్ని మార్చేందుకు మహిళా కమిషన్ యత్నించిందని తెలిపాడు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా అలీఖాన్ ఒక పోస్ట్ పెట్టాడు.
అశోకా వర్సిటీ కీలక ప్రకటన
అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటితో తమకు సంబంధం లేదని పేర్కొంటూ అశోకా యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.భారత సేనలను చూసి అశోకా యూనివర్సిటీ, దానిలో భాగమైన ప్రతీ ఒక్కరు గర్విస్తున్నారని పేర్కొంది. జాతీయ భద్రత కోసం భారత సేనలు ఎలాంటి ఆపరేషన్లు చేసినా అండగా నిలుస్తామని యూనివర్సిటీ తేల్చి చెప్పింది.