Swati Maliwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో చోటుచేసుకున్న ఓ ఘటన కలకలం రేపింది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సోమవారం ఉదయం వచ్చి కేజ్రీవాల్ పీఏ వైభవ్ కుమార్ తనతో అనుచితంగా ప్రవర్తించారని చెప్పారని ఢిల్లీలోని సివిల్ లైన్స్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఆమె నుంచి ఇంకా అధికారిక ఫిర్యాదు అందలేదని తెలిపారు. పోలీసు స్టేషనుకు వచ్చి వెళ్లిన తర్వాత స్టేషన్‌కు సంబంధించిన పోలీస్ కంట్రోల్ రూం (పీసీఆర్)కు కూడా స్వాతి మలివాల్ పలుమార్లు కాల్స్ చేశారన్నారు.
ఉదయం 10 గంటలకు స్వాతి మలివాల్ (Swati Maliwal) నుంచి తమకు రెండు కాల్స్ వచ్చాయని సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ అధికారులు వెల్లడించారు. ‘‘సీఎం కేజ్రీవాల్ తన పీఏతో నాపై దాడిచేయించారు’’ అని స్వాతి మలివాల్ ఫోన్ లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. పీసీఆర్ పోలీసు సిబ్బంది వెంటనే సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే సరికే.. స్వాతి మలివాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు సీఎం కేజ్రీవాల్ కార్యాలయం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఎలాంటి వివరణను విడుదల చేయలేదు. అయితే పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసింది ఎంపీ స్వాతి మలివాల్ అవునా? కాదా? అనేది తేల్చే దిశగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.
Also Read :KTR – AP Elections : ఏపీ ఎన్నికలపై మనసులో మాట చెప్పేసిన కేటీఆర్
ఈ వార్తలపై బీజేపీ ఐటీ వింగ్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ.. ‘‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఎంపీ స్వాతి మలివాల్ స్పందించలేదు. ఆ టైంలో స్వాతి మలివాల్ ఇండియాలోనే లేరు. కేజ్రీవాల్ అరెస్టయిన చాలా రోజుల తర్వాత ఇండియాకు వచ్చారు’’ అని గుర్తు చేశారు. స్వాతి మలివాల్ పై దాడి జరిగిందనే వార్తలపై ఆప్ వివరణ ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత కపిల్ మిశ్రా డిమాండ్ చేశారు. ఓ మహిళా ఎంపీపై సాక్షాత్తూ సీఎం నివాసంలోనే దాడి జరిగిందనే వార్త నిజం కాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.