Site icon HashtagU Telugu

Kejriwal Vs BJP : ‘‘బీజేపీ తప్పుడు చర్యలను సమర్ధిస్తారా ?’’.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ లేఖ

Arvind Kejriwal Vs Bjp Mohan Bhagwat Rss Delhi Aap

Kejriwal Vs BJP : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ లేఖ రాశారు. బీజేపీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను మీరు సమర్ధిస్తారా  అని మోహన్ భగవత్‌ను కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘‘ఢిల్లీలో ఓట్ల కోసం బీజేపీ డబ్బులు పంచుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఎన్నికల కోడ్‌ను కమలదళం ఉల్లంఘిస్తోంది. దీనిపై ఆర్ఎస్ఎస్ స్పందన ఏమిటి ?’’ అని ఆప్ అధినేత లేఖలో నిలదీశారు. ‘‘ఢిల్లీలో బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ ఓట్లు అడగబోతోందనే ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా ? ఒకవేళ అదే నిజమైతే.. బీజేపీ తప్పుడు చర్యలను సమర్ధిస్తారా వ్యతిరేకిస్తారా అనే దానిపై ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇవ్వాలి’’  అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ‘‘ఢిల్లీలో పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. ప్రత్యేకించి ఢిల్లీలో ఉన్న పూర్వాంచల్ ప్రాంత ఓటర్లు, మురికివాడల ఓటర్ల పేర్లను ఓటర్ల లిస్టుల నుంచి తొలగించేందుకు కమలదళం యత్నిస్తోంది.  చాలా ఏళ్లుగా ఢిల్లీలో ఉంటున్న ప్రజల ఓట్లు తొలగించడం అన్యాయం. బీజేపీ కుట్రలు సరైనవే అని ఆర్ఎస్ఎస్ భావిస్తోందా.. మోహన్ భగవత్ సమాధానం చెప్పాలి’’ అని ఆప్ అధినేత(Kejriwal Vs BJP) కోరారు.

Also Read :Condoms Sales : డిసెంబరు 31న బిర్యానీతో పోటీపడి కండోమ్ సేల్స్

ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ రాసిన లేఖను ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ లేఖ ద్వారా కౌంటర్ చేశారు. కేజ్రీవాల్ లేఖలో ఉన్నవన్నీ అబద్ధలేనని ఆయన తేల్చి చెప్పారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారం చేయడం ఆపాలని కేజ్రీవాల్‌కు సూచించారు. కనీసం న్యూ ఇయర్‌లోనైనా సన్మార్గంలోకి రావాలని కేజ్రీవాల్‌ను కోరారు. ‘‘కేజ్రీవాల్ ఆయన సంతానంపై ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పరని మేం భావిస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం దేశ వ్యతిరేక శక్తుల నుంచి విరాళాలను తీసుకునేది లేదని కనీసం ఇప్పటికైనా కేజ్రీవాల్ ప్రతిన బూనాలి. ఢిల్లీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చే పద్ధతిని ఆయన ఆపాలి’’ అని ఢిల్లీ బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు.  ఈమేరకు విమర్శలతో కూడిన ఒక లేఖను కేజ్రీవాల్‌‌కు వీరేంద్ర సచ్‌దేవ పంపారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే హస్తిన పాలిటిక్స్ హీటెక్కాయి.

Also Read :Financial Changes 2025 : 2025లో ఆర్థిక విషయాల్లో ఎన్నో మార్పులు.. అవేంటో తెలుసుకోండి