Delhi Assembly elections: ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆప్ పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అంతే కానీ సీఎం పీఠంపై కోరికతో, లేదా డబ్బు సంపాదించాలనే అత్యాశతో కాదని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఢీల్లీలో సొంత ఇల్లు కూడా లేదని వెల్లడించారు.
Read Also: Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త యాడ్ చూశారా..? బట్టల షాపింగ్ మాల్ కి..
”బీజేపీ ఆరెస్సెస్ నుంచి పుట్టింది. ప్రస్తుతం ఆ పార్టీ చేస్తున్న రాజకీయాలతో ఆరెస్సెస్ సంతృప్తిగా ఉందా? లేదా? అనే విషయాన్ని మోహన్ భగవత్ ప్రజలకు తెలియజేయాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను ప్రధాని పార్టీలో చేర్చుకోవడం సమంజసమా అని ఆయనను అడగాలనుకుంటున్నాను. పార్టీ నాయకులు 75 ఏళ్లు రాగానే పదవీ విరమణ చెయ్యాలనే నిబంధన బీజేపీలో ఉంది. ఇది ప్రధాని మోడీకి వర్తించదా?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
రాబోయే ఢిల్లీ ఎన్నికలు తనకు అగ్నిపరీక్ష వంటివని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను నిజాయితీ గల వాడినని నమ్మితేనే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలను కోరారు. కేజ్రీవాల్ అనే వ్యక్తి నిజాయితీ లేనివాడైతే మహిళలకు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్, ప్రభుత్వాసుపపత్రుల్లో ఉచితంగా వైద్యం, పిల్లల కోసం కొత్త పాఠశాలల ఏర్పాటు చేసేవాడా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రజలకు ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయా అని ప్రజలను అడిగారు.