Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో తిహార్ జైలు అధికారులు స్పందించారు. అవన్నీ అసత్య ఆరోపణలు అని వారు స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఏప్రిల్ 1న తిహార్ జైలుకు తీసుకొచ్చినప్పుడు కేజ్రీవాల్(Arvind Kejriwal) బరువు 65 కిలోలు అని, ఎన్నికల టైంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసేటప్పుడు కూడా ఆయన బరువు 65 కిలోలే అని జైలు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం అనంతరం జైలులో లొంగిపోయే సమయానికి కేజ్రీవాల్ బరువు 63.5 కిలోలుగా ఉందన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ బరువు 61.5 కిలోలు ఉందని జైలు అధికారులు తెలిపారు. అన్నం తక్కువగా తింటున్నందు వల్లే ఢిల్లీ సీఎం బరువు తగ్గిందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కోసం వైద్యులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ బోర్డు ఇచ్చిన సలహాల మేరకు కేజ్రీవాల్‌కు ఆహారం, వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో ఆప్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జైలు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
కేజ్రీవాల్ ఆరోగ్యం విషయమై ఇటీవల ఢిల్లీ మంత్రి అతిషి, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కేజ్రీవాల్ ఆరోగ్యం బాగా లేదు. ఆయన బరువు తగ్గుతోంది. షుగర్ పెరుగుతోంది. జైలులో(Tihar Jail) కేజ్రీవాల్‌కు తగిన వైద్యం అందడం లేదు. ఒకవేళ కేజ్రీవాల్‌కు జైలులో స్ట్రోక్ వస్తే ఎవరు బాధ్యులు ? ఆయన మెదడు దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అని అతిషి ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. తప్పుడు ఆరోపణలతో కోర్టులను తప్పుదోవ పట్టించేందుకు ఆప్ నేతలు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలోని మనీ లాండరింగ్ కేసులో ఇటీవలే కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైంది. కానీ సీబీఐ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. దీంతో ఆయన ఇంకా తిహార్ జైలులోనే ఉన్నారు.