Arvind Kejriwal : అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బాబా సిద్ధిఖీ హత్యతో మహారాష్ట్ర మాత్రమే కాదు.. యావత్ దేశం భయపడుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. దేశంలో మళ్లీ గ్యాంగ్‌స్టర్ పాలనను తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దుష్ట పాలకులకు వ్యతిరేకంగా దేశ ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
Also Read :CIA Plot : వెనెజులా అధ్యక్షుడు మాడురో హత్యకు సీఐఏ కుట్ర భగ్నం ?
బాబా సిద్ధిఖీకి బాలీవుడ్ టాప్ సెలిబ్రిటీలతో మంచి సంబంధాలు ఉండేవి. అందుకే ఆయన మరణంపై ఎంతోమంది టాప్ స్టార్లు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. సిద్దిఖీతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. లీలావతి ఆస్పత్రిలో బాబా సిద్ధిఖీ భౌతిక కాయాన్ని చూసి బయటికి వచ్చిన అనంతరం సినీ నటి శిల్పా శెట్టి ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అకస్మాత్తుగా బాబా సిద్దిఖీకి ఇలా జరుగుతుందని తాము అనుకోలేదన్నారు. తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ఆస్పత్రికి వెళ్లి శిల్పా శెట్టి నివాళులు అర్పించారు.
Also Read :Nara Rohit : గ్రాండ్‌గా నారా రోహిత్ నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు వీరే
ఇక బాబా సిద్ధిఖీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. బాబా సిద్ధిఖీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిద్దిఖీ మరణవార్త విన్న వెంటనే సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్‌ను రద్దు చేసుకున్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఇక బాబా సిద్ధిఖీ హత్యకు నిరసనగా ఆదివారం తమ పార్టీ కార్యకాలపాలు అన్నింటినీ రద్దు చేశామని అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ ప్రకటించింది.