Kejriwal Resignation : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ‘‘న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజా న్యాయస్థానం నాకు న్యాయం చేస్తుంది. ఇంకొన్ని నెలల్లోనే ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి ఢిల్లీ ప్రజలు ఆదేశించిన తర్వాతే నేను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటాను’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమైతే ఫిబ్రవరిలో జరగాలి. కానీ వాటిని మహారాష్ట్ర పోల్స్‌తో పాటు నవంబరులోనే నిర్వహించాలని మేం ఈసీని కోరుతున్నాం’’ అని ఆప్ చీఫ్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాదాపు ఆరు నెలల పాటు ఆయన తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో గడిపారు. రెండు రోజుల క్రితమే ఆయనకు మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చిన వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కేజ్రీవాల్(Kejriwal Resignation) నిర్ణయించడం గమనార్హం.
Also Read :Asteroid Alert: ఇవాళ భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్
‘‘ప్రజల ఆశీస్సులతో బీజేపీ కుట్రలన్నింటిని ఎదుర్కొనే శక్తి మాకు ఉంది. మేం బీజేపీ ముందు తలవంచం. అమ్ముడుపోం. మేం నిజాయితీపరులం. అందుకే ఢిల్లీని ఇంతలా డెవలప్ చేశాం. బీజేపీ వాళ్ళు మా నిజాయితీని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్లకు నిజాయితీ లేదు. డబ్బు కోసం మేం అధికారంలోకి రాలేదు. అధికారం కోసం మేం పాకులాడం. ప్రజలే న్యాయాన్నిగెలిపిస్తారు’’ అని కేజ్రీవాల్ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.
Also Read :Prashant Kishor : మద్య నిషేధంతో ఏటా రూ.20వేల కోట్ల నష్టం.. గెలవగానే బ్యాన్ ఎత్తేస్తాం : పీకే
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం బ్రిటీష్ వాళ్ల కంటే నియంతృత్వంతో పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘‘మోడీ సర్కారు ఎంత వేధించినా నేను జైలుకు వెళ్లానే తప్ప సీఎం పోస్టుకు రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే అలా చేశాను. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్‌లపైనా బీజేపీ వాళ్లు కేసులు పెట్టించారు. బీజేపీయేతర పార్టీల సీఎంలను నేను కోరేది ఒక్కటే. బీజేపీ వాళ్లు పెట్టించే కేసులకు భయపడి రాజీనామా చేయొద్దు. బీజేపీ వాళ్లను ఈ గేమ్‌లో ఓడించాల్సిన బాధ్యత మనపైనే ఉంది’’ అని కేజ్రీవాల్ కామెంట్ చేశారు.