live streaming : సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ మేరకు ఈరోజు ఒక టెస్ట్ ఫార్మాట్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. యూట్యూబ్ ఛానెల్ కు బదులుగా కోర్టుకు చెందిన సొంత అప్లికేషన్ పై ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకుంది. అయినా ఆచరణలోకి రాలేదు.
అయితే, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ రోజు.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే తొలిసారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు.
కాగా, 2022 నుంచి రాజ్యాంగ ధర్మాసనం ప్రజా ప్రాముఖ్యత కలిగిన విచారణలు, తీర్పులు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించిన మొదటి రోజున ఎనిమిది లక్షల మంది వీక్షించారు. ఇటీవల NEET-UG విషయంలో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారణలు, ఆర్జీ కర్ సుమోటో కేసు కూడా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
Read Also: Raja Singh : ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం పై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు