Arif & Sarus: ఆరిఫ్.. కొంగ.. హాట్ టాపిక్ గా మారిన ఒక అనుబంధం

భారీ కొంగను కాపాడి.. దానితో స్నేహం చేస్తూ ఇటీవల వార్తలకు ఎక్కాడు ఉత్తరప్రదేశ్‌ లోని అమేథీ జిల్లా  మంద్ఖా గ్రామానికి చెందిన ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌.

Arif & Sarus : భారీ కొంగను కాపాడి.. దానితో స్నేహం చేస్తూ ఇటీవల వార్తలకు ఎక్కాడు ఉత్తరప్రదేశ్‌ లోని అమేథీ జిల్లా  మంద్ఖా గ్రామానికి చెందిన ఆరిఫ్ ఖాన్ గుర్జార్‌. అతడిపై అటవీ శాఖ కేసు నమోదు చేసి నోటీసులు కూడా పంపింది. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఏప్రిల్ 4న గౌరీగంజ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు.మార్చి 21నే ఆ కొంగను అటవీ అధికారులు రాయ్‌బరేలీలోని సమ్‌సపుర్‌ అభయారణ్యానికి తరలించారు. పోలీసుల నోటీసుపై ఆరిఫ్‌ స్పందిస్తూ.. ‘‘గాయపడిన కొంగకు వైద్యం చేసి బాగు చేశాను. దాన్ని బంధించలేదు. నాతోనే ఉంచుకోవాలని అనుకోలేదు. కానీ, నేను ఎక్కడికి వెళ్లినా అది నా దగ్గరకు వచ్చేది. ఈ కేసులో నేను పూర్తిగా అమాయకుడిని’’ అని ఆరిఫ్‌ వాపోయాడు.

అఖిలేష్ యాదవ్‌తో మహ్మద్ ఆరిఫ్ (Arif)..

మీడియాలో సారస్, ఆరిఫ్ కథను చూసిన తర్వాత యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమేథీ వెళ్లి ఆరిఫ్ ను కలిశారు. కొంగతో దిగిన ఫోటో ను కూడా అఖిలేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బుధవారం లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిలేష్ యాదవ్‌తో మహ్మద్ ఆరిఫ్ కూడా పాల్గొన్నారు.

నెమలికి ఆహారం పెట్టే పెద్దోళ్లను ఏం చేయరా?

 

అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ”ఆరిఫ్ కొంగకు సేవ చేసి, దానితో స్నేహం చేశారు. కొంగ మనిషితో కలిసి జీవించడం, ప్రవర్తన మారడం చాలా అరుదుగా కనిపిస్తుంది.కొంగ వారి వద్ద ఎలా ఉంటుందనేదే పరిశోధనాంశం. నేను వెళ్లినందుకే కొంగను లాక్కున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వమే కొంగను లాక్కుంటుంటే నెమలికి ఆహారం ఇచ్చే వారి నుంచి నెమలిని కూడా లాక్కోవాలి కదా? అక్కడికి చేరుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా. అక్కడికి వెళ్లి నెమలిని తీసుకొచ్చే ధైర్యం ఏ అధికారికైనా ఉందా? కొంగను, దాన్ని పెంచిన ఆరిఫ్‌ని నేను కలిశాననే ప్రభుత్వం ఇలా చేసింది” అని ఆయన ఆరోపించారు.

ఎగిరిపోతే మళ్లీ తీసుకువస్తారా?

పక్షిని ఏ గదిలోనూ ఉంచలేదని, స్వేచ్ఛగానే వదిలివేసినట్లు అటవీ అధికారులు స్పష్టంచేశారు.పక్షి ఎగిరిపోతే మళ్లీ తీసుకువస్తారా? అని మీడియా ప్రశ్నించగా ..ఆరిఫ్‌ని గ్రామంలో ఎక్కడికి వెళ్లినా, అతడి ఇంటికి వెళ్లినా అధికారులు తిరిగి తీసుకువస్తారన్నారు.కొంగ తనంతట తాను తింటున్నప్పటికీ గోధుమలు, నీళ్లు, రొట్టెలు విడివిడిగా ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

రక్షిత పక్షి లేదా జంతువును ఉంచుకోవడం చట్టవిరుద్ధం. వాటికి ఆహారం ఇవ్వడం కూడా చట్టవిరుద్ధం. మీరు అటువంటి పక్షిని రక్షించవచ్చు, కానీ ఆ తర్వాత మీరు దాన్ని చట్టబద్ధంగా అప్పగించాలి. ఇది చేయకపోతే, ఇతరులు కూడా అలాంటి పక్షులను ఉంచుకుంటారు.

Also Read:  Temperatures Alert: భాగ్యనగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాతావరణ శాఖ అలెర్ట్