ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Attack) దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు (Terrorists) ఇప్పటికీ దేశంలోనే, ముఖ్యంగా కశ్మీర్ (Kashmir) లోని దక్షిణ భాగంలో దాక్కున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి సమీపంలో మూడు ప్రాంతాల్లో దాడికి వారం ముందు రెక్కీ జరిపినట్టు సమాచారం. భద్రతా బలగాలపై మళ్లీ దాడికి అవకాశం ఉండొచ్చని భావించి, వారి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ దాడిని నిర్వర్తించిన ఉగ్రవాదులు తాము బయట ప్రజలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. వారు తమ వెంట ఆహారం, ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు వంటి అవసరమైన అన్ని వస్తువులు తీసుకువచ్చినట్టు భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. వారు ఉపయోగించిన కమ్యూనికేషన్ పరికరాలు ఎన్‌క్రిప్టెడ్ సమాచారం పంపించగలవు, వాటికి సిమ్ అవసరం ఉండదు. ఈ విధంగా వారు ఇంటెలిజెన్స్ శాఖల నిఘా దృష్టికి చిక్కకుండా దాడిని విజయవంతంగా నిర్వహించగలిగారు.
ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్తాన్‌పై దౌత్య పరంగా కఠిన చర్యలు తీసుకుంది. సింధు నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేగాక, పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఉగ్రదాడి నేపథ్యంలో వృద్ధి చెందుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల మంత్రులతో ఫోన్ ద్వారా చర్చించారు. అయితే దేశ భద్రతకు భంగం కలిగించిన ఈ దాడి వెనక ఉన్న కుట్రను బయటపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వంతో పాటు భద్రతా సంస్థలు తీవ్రంగా పని చేస్తున్నాయి.