Site icon HashtagU Telugu

Chhattisgarh : మరోసారి ఎన్‌కౌంటర్‌..ఐదుగురు మావోయిస్టులు మృతి

Another encounter...five Maoists killed

Another encounter...five Maoists killed

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతం గత కొన్ని రోజులుగా భద్రతా బలగాల ఆపరేషన్‌లతో ఉలిక్కిపడుతోంది. బీజాపుర్ జిల్లాలో ఉన్న నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మూడు రోజులుగా కొనసాగుతున్న మావోయిస్టులపై ఆపరేషన్‌లో తాజాగా ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరి మృతదేహాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, భారీ స్థాయిలో ఆయుధాలు కూడా పోలీసులు పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది నిర్వహిస్తున్న ఈ విస్తృత ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అధిక వేడి, తేనెటీగల దాడులు, పాముకాట్లు, నీటి కొరత వంటి సమస్యల కారణంగా కొంతమంది జవాన్లు అస్వస్థతకు లోనయ్యారు. గాలింపు చర్యల మధ్య మరికొందరు జవాన్లు గాయపడినట్టు తెలుస్తోంది.

Read Also: Kishan Reddy : తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది..

గత మూడు రోజులుగా నేషనల్ పార్క్‌ పరిధిలో మావోయిస్టులపై ముమ్మరంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌ ఇప్పటికే నక్సల్ పార్టీకి భారీ నష్టం తీసుకొచ్చింది. గత రెండు రోజుల్లో మావోయిస్టుల అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ మృతిచెందారు. వీరిలో సుధాకర్‌పై కోటి రూపాయల బహుమతి ఉండగా, భాస్కర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. దీనితోపాటు పార్టీకి కీలక నేతల కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సుమారు 80 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం గత కొంతకాలంగా మావోయిస్టుల కోసం సురక్షిత ప్రదేశంగా మారింది. ఈ పరిధిలో ఒక్క పోలీస్ స్టేషన్ లేదా భద్రతా క్యాంప్ కూడా లేని నేపథ్యంలో మావోయిస్టులు ఇక్కడ తనదైన పట్టు సాధించారు. అయితే విశ్వసనీయ నిఘా సమాచారంతో పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం.

కర్రెగుట్టల నుంచి అబూజ్‌మడ్ పర్వత శ్రేణుల వరకూ ప్రతి చెట్టు, కొండకోనలోనూ సర్చింగ్ కొనసాగుతోంది. ఈ దాడులతో మావోయిస్టు పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో పార్టీ కీలక నేత బస్వరాజ్ మృతి చెందగా, ఇప్పుడు అగ్ర కమాండర్లు సుధాకర్, భాస్కర్ మృతిచెందారు. ఇక ఇదే ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడ్మా ఉన్నట్లు సమాచారం. అతడి లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భద్రతా బలగాలు, నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ముమ్మర ఆపరేషన్ వల్ల దండకారణ్యంలో మావోయిస్టుల ఆధిపత్యం క్షీణించడంతో పాటు, భద్రతా పరంగా ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశముంది.

Read Also: Mukesh Ambani : రూ.151 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ… ఎవరికంటే!