Site icon HashtagU Telugu

Old Grudge in a New Parliament : కొత్త పార్లమెంటు భవనంలో పాత విద్వేషం

An Old Grudge In A New Parliament Building

An Old Grudge In A New Parliament Building

By: డా. ప్రసాదమూర్తి

Old Grudge in a New Parliament : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంటు పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనంలో (New Parliament) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వారు, దేశాన్ని ఆధునికత వైపు, సర్వ మానవ సౌభ్రాతృత్వం వైపు, కులాతీత మతాతీత లౌకిక స్వచ్ఛా మార్గం వైపు నడిపిస్తారని దేశమంతా ఆశతో ఎదురు చూస్తోంది. 27 సంవత్సరాలుగా చీకటిలో మగ్గుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి, అందులో లోపాలు ఎలా ఉన్నా, ఆ ఘనత పాలక ప్రభుత్వం దక్కించుకుంది. ఈ బిల్లులో లోపాల గురించి, మిగిలిన వర్గాల రిజర్వేషన్ గురించి, తక్షణమే అమలు గురించి ప్రతిపక్షాలు తమ సూచనలు చేశాయి. ఇదంతా సరే. మరి కొత్త పార్లమెంటు (New Parliament) భవనంలో పాలక నేతల వైఖరిలో పాతదనం పోయి కొత్తదనం ఏమైనా వచ్చిందా అని దేశ ప్రజలు ఆరా తీయడం తప్పేమీ కాదు. కానీ కొత్త పార్లమెంటు భవనం సాక్షిగా పాతవిద్వేషాన్ని (Grudge) వెళ్ళగక్కి, వీళ్ళేమీ మారలేదని దేశం అనుకోవడానికి ఒక ఆధారాన్ని బిజెపి ఎంపీ ఒకరు కల్పించారు.

బిజెపి ఎంపీ రమేష్ విధూరీ, బీఎస్పీ ఎంపీ దానిష్ అలీ పై అనుచిత, అప్రజాస్వామిక, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కొత్త పార్లమెంటు (New Parliament) భవనానికి ఒక కొత్త మచ్చ తీసుకొచ్చారు. చంద్రయాన్-3 పై సభలో గంభీర చర్చ జరుగుతోంది. అయితే చంద్రయాన్ సఫలీకృత ప్రయోగం వెనక అంతా ఏలిన వారి మహిమే ఉందని, దాని క్రెడిట్ తమకు, తమ అధినాయకుడైన ప్రధాని మోడీకి దక్కుతుందని అధికార బిజెపి భారీ సభలో భారీ భారీ ప్రకటనలు చేసింది. ఈ సందర్భంగా బీఎస్పీ ఎంపీ దానిష్ అలీ మాట్లాడుతూ చంద్రయాన్ త్రీ సక్సెస్ వెనక వైజ్ఞానికుల కృషి ఉందని, ఎందరో సైంటిస్టులు నిరంతర పరిశ్రమ చేసి ఈ విజయాన్ని సాధించారని, ఈ విజయం సైంటిస్టులదని, కొందరు వ్యక్తులది కాదని అన్నారు. అంతే పార్లమెంటులో పాలక పక్షం నుంచి ఒక తుఫాను రేగింది. ఆ తుఫాను పేరే రమేష్ విధూరీ.

చంద్రయాన్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న అధికార పక్షానికి దానిష్ అలీ చెప్పిన మాటలు రుచించలేదు. వెంటనే ఆయన పైన బిజెపి ఎంపీ రమేష్ విధూరీ దాడి ప్రారంభించాడు. అది ప్రజాస్వామ్యబద్ధమైన, మర్యాదపూర్వకమైన ఎదురుదాడి అయితే అభ్యంతరం లేదు. కానీ ప్రతిపక్ష బీఎస్పీ ఎంపీని ఉద్దేశించి ఉగ్రవాది, ఆతంకవాది, ముల్లా అంటూ చాలా విద్వేషపూరితమైన (Grudge) నీచమైన కామెంట్లు చేశారు. నిండు సభ నివ్వెర పోయింది. పార్లమెంట్ (New Parliament) వ్యవస్థ తలదించుకుంది. దీనికి ప్రతిస్పందనగా బీఎస్పీ ఎంపీ దానిష్ అలీ స్పీకర్ ను కలిసి సదరు బిజెపి ఎంపీపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన చేసుకున్నాడు. ఇది సెక్షన్ 222, 226, 227 ఆధారంగా ఆయన స్పీకర్కు నోటీసులు అందజేశారు. అంతేకాదు, గౌరవ మర్యాదలకు, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అయిన పార్లమెంటులో ఒక పార్లమెంట్ సభ్యుడిపై ఇంత విద్వేషపూరితమైన దాడి జరగడం తనకు భయాందోళనలు కలిగిస్తుందని, స్పీకర్ సదరు ఎంపీపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, లేకుంటే పార్లమెంటులో ఇక అడుగుపెట్టబోనని బీఎస్పి ఎంపీ దుఃఖభరిత హృదయంతో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

చూశారా. పార్లమెంటు భవనం కొత్తదే గాని ఏలిన వారు హృదయాల్లో గూడుకట్టుకున్న విద్వేష (Grudge) భావనలు తొలగించుకోలేదు. అంతకు ముందే పార్లమెంట్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ, సభ్యులందరికీ సభ్యతా సంస్కారం గురించి బోధించారు. మీరు మర్యాదగా ఉంటే పాలక పక్షం కూర్చునే వైపు కూర్చుంటారని, మర్యాద తప్పితే ఎక్కడున్నారో అక్కడే ఉంటారని విపక్షాల వైపు ఇషారా చూపించి ప్రధాని మాట్లాడారు. ఆ మాటలు పార్లమెంటు భవనంలో ఇంకా మారుమోగుతుండగానే ఆయన పార్టీకి చెందిన ఎంపీ ఇలాంటి విషం కక్కారు. దీనిపై బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ ఎంపీకి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి నోటీసులు, ఇలాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా ఠాకూర్ లాంటి ఎందరికో గతంలో కూడా జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వారిపై చర్యలు తీసుకున్న ఉదంతాలు ఎక్కడా లేవు. ఇది కూడా అలాంటి కంటితుడుపు చర్య కావచ్చని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా కొత్త పార్లమెంటు భవనంలో సభ్యులు తొలిసారి ఆశీనులైన ఈ తొలి సమావేశాల్లోనే ఇంతటి విద్వేషాగ్నిని రగిలించడం సబబు కాదని రాజకీయ విజ్ఞులు, పెద్దలు చెబుతున్నారు. మరి ఈ బుద్ధులు అధికారంలో ఉన్న వారి చెవులకు సోకుతాయో లేదో చూడాలి.

Also Read:  I Am With CBN : జెనెక్స్ కార్ షోరూంలో వైసీపీ నేత‌ల‌కు సేల్స్‌& స‌ర్వీస్ నిలిపివేత‌.. కార‌ణం ఇదే..?