Ajmer Dargah : రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా ప్రాంగణంలో శివాలయం ఉందంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంశం ఇటీవలే ఉద్రిక్తతలు పెంచింది. ఈ పరిణామం నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అజ్మీర్ దర్గాకు చాదర్‌ను పంపనున్నారు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఏటా అజ్మీర్ దర్గాకు చాదర్‌ను పంపే సంప్రదాయాన్ని ఈసారి కూడా మోడీ కొనసాగించనున్నారు. ప్రధాని మోడీ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ‘చాదర్’ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీలకు అందజేస్తారు. వారిద్దరూ చాదర్‌ను అజ్మీర్‌లోని ఖాజా మొయినుద్దీన్ చిస్తీ ఉర్స్ సందర్భంగా దర్గాలో అందజేస్తారు. ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అజ్మీర్ షరీఫ్ దర్గాకు నరేంద్ర మోడీ పదిసార్లు ‘చాదర్’ను(Ajmer Dargah) సమర్పించారు. ఇప్పుడు 11వ సారి కూడా ఆయన చాదర్‌ను దర్గాకు పంపుతున్నారు. గత సంవత్సరం 812వ ఉర్స్ సందర్భంగా ప్రధాని మోడీ తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, జమాల్ సిద్ధిఖీలు కలిసి ‘చాదర్’ను అజ్మీర్ దర్గాకు సమర్పించారు.
Also Read :Fact Check : పాకిస్తాన్‌లో తల్లిని పెళ్లాడిన యువకుడు ? నిజమేనా ?
అజ్మీర్ షరీఫ్ దర్గాలో శివుడి ఆలయం ఉందని పేర్కొంటూ హిందూ సేన సంస్థ అజ్మీర్‌లోని మున్సిఫ్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. మూడు పక్షాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందన తెలియజేయాలని వారందరినీ కోరింది. హిందూసేన పిటిషన్‌లోని అభియోగాలు అవాస్తవమని, దాన్ని కొట్టివేయాలంటూ డిసెంబరు 20న అజ్మీర్ షరీఫ్ దర్గా కమిటీ అజ్మీర్‌లోని మున్సిఫ్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 24న జరగబోతోంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ నుంచి అజ్మీర్ దర్గాకు చాదర్ కానుక వెళ్తుండటం గమనార్హం. హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ 813వ ఉర్స్ డిసెంబర్ 28న ప్రారంభమైంది.