Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మహ్మద్ ప్రవక్తపై హిందూ పూజారి యతి నర్సింఘానంద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యోగి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇతర మతాలు, ప్రజా విశ్వాసాలపై అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎవరు అలా మాట్లాడినా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, శిక్షపడేలా చేస్తామని యూపీ సీఎం వెల్లడించారు.
Also Read :Matrimonial Ad : వరుడి వెరైటీ యాడ్ వైరల్.. ఆదాయం, ప్రొఫెషన్ గురించి ఏం చెప్పాడంటే..
‘‘అన్ని మతాలను మనం గౌరవించాలి. ఇతర మతాల గొప్ప వ్యక్తులను, దేవతలను అగౌరవపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఊరుకోం.వారిని వదిలిపెట్టం. చట్టప్రకారం వారిపై యాక్షన్ తీసుకొని తీరుతాం’’ అని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ‘‘నిరసనల పేరుతో అరాచకంగా ప్రవర్తించినా, దాడులకు తెగబడినా ఊరుకోం. అలాంటి వాటిని మేం సహించం. ఎవరైనా నిరసనల పేరుతో అరాచకానికి దిగితే దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు’’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. త్వరలో పండుగల సీజన్ రాబోతోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లపై ఇవాళ యూపీ డీజీపీ, చీఫ్ సెక్రెటరీలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read :Zakir Naik : జాకిర్ నాయక్ వర్సెస్ ఒక యువతి.. ఆ ప్రశ్నపై వాడివేడిగా వాగ్వాదం
హిందూ పూజారి యతి నర్సింఘానంద్ గతంలో చాలాసార్లు ఇస్లాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయనపై గజియాబాద్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు యూపీలోని చాలా పోలీసు స్టేషన్లలో నర్సింఘానంద్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయి. నర్సింఘానంద్‌ను వెంటనే అరెస్టు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. ఆయన వల్ల యూపీలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. అలాంటి వారిని ఉపేక్షించకూడదని యూపీ సర్కారుకు సూచించింది.