Civils Mains 2024 Exams: రేపటి ( సెప్టెంబర్ 20) నుండి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ ఏడాది కూడా యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ప్రతీయేట లక్షలాది మంది యువతీ యువకులు ఈ పరీక్షలకు పోటీ పడుతుంటారు. ఇప్పటికే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయ్యాయి. జూన్ 16వ తేదిన ప్రిలిమ్స్ పరీక్ష జరగగా, వాటి ఫలితాలు జులై 1వ తేదిన విడుదలయ్యాయి.
Read Also: Idi Manchi Prabhutvam Programme : ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు
యూపీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగగా, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. ఒక్కో సెషన్ పరీక్ష మూడు గంటల పాటు ఉంటుంది. మెయిన్స్ పరీక్షలు మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 24 పట్టణాల్లో సివిల్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో మెయిన్స్ పరీక్షల కోసం 6 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 708 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో వారు చూపిన ప్రతిభ ఆధారంగానే వారికి సర్వీసులు కేటాయిస్తారు.