Ajit Doval: ‘ఆపరేషన్ సిందూర్’ తరవాత దేశంలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో అత్యవసర భేటీ నిర్వహించారు. మోడీ నివాసానికి స్వయంగా వెళ్లిన ధోవల్, ప్రధానితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పాక్ పై భారత ఆర్మీ ప్రతీకార దాడుల అనంతరం మోడీతో ధోవల్ భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: Car AC: మీ కారులో ఏసీ పనిచేయడం లేదా? అయితే ఇలా చేయండి!
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా సాగిన నేపథ్యంలో, దాని ప్రాధమిక నివేదికను ధోవల్ ప్రధానికి సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్తాన్ నుండి వస్తున్న ముప్పు, ఎల్ఓసీ వెంబడి జరుగుతున్న కాల్పుల గురించి మోడీకి వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. పాక్ మళ్లీ నేరుగా దాడులకు దిగకుండా అమాయకులైన సివిలియన్లను లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులకు పాల్పడుతుండటం గమనార్హం.
ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ వివరాలను వివిధ రాజకీయ పార్టీలకు వెల్లడించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈరోజు అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీల ప్రముఖులు హాజరయ్యారు. సుమారు వంద మందికి పైగా ఉగ్రవాదులు భారత సైన్యం చర్యల్లో హతమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ప్రతిపక్షాలకు పూర్తి సమాచారం ఇవ్వాలని, జాతీయ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భద్రతా వ్యవహారాల్లో సమాఖ్య సహకారం అత్యవసరమనే అభిప్రాయం వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికైతే ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది.