Site icon HashtagU Telugu

Ahmedabad : ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక

Air India plane crash: Preliminary report to the Center

Air India plane crash: Preliminary report to the Center

Ahmedabad : అహ్మదాబాద్‌లో జూన్ 12న చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) వేగంగా దర్యాప్తును కొనసాగిస్తోంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు ఇంకా విషాదంలోనే ఉండగా, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేపట్టి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్టు ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదికను మంగళవారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులు అందుకున్నారు. వైమానిక ప్రమాదాలపై అనుభవం కలిగిన నిపుణుల బృందం ఈ దర్యాప్తును పరిశీలిస్తున్న AAIB డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఈ కమిటీ సభ్యుల్లో ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన డ్రీమ్‌లైనర్ విమానం నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌లను స్పెషల్ AAIB ల్యాబ్‌కు తరలించి, వాటిలోని డేటాను విజయవంతంగా డౌన్‌లోడ్ చేశారు.

Read Also: Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్‌

అందులో విమానపు చివరి నిమిషాల లోపల జరిగిన చర్చలు, సాంకేతిక లోపాలు, సిబ్బంది చర్యలు తదితర అంశాలపై సమగ్రమైన విశ్లేషణ చేశారు. ఈ నివేదికలో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. విమాన డేటా, వాతావరణ పరిస్థితులు, సిబ్బంది స్పందన. టేకాఫ్ తర్వాత కేవలం కొన్ని క్షణాల్లోనే విమానం కుప్పకూలిపోయిన తీరును ఇది వివరించింది. కాగా ఈ నివేదికను ఇప్పటికీ అధికారికంగా బయట పెట్టలేదు. కానీ ఈ వారాంతంలో ప్రజలకు విడుదల చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గల ప్రధాన కారణాలపై స్పష్టత వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదం వివరాలకు వస్తే జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడగా, మిగతా 241 మంది మృతి చెందారు. అంతేకాకుండా, ఈ విమానం అహ్మదాబాద్‌లోని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో, అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు, సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 270కు పైగా ఉండే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం గాయపడిన ఏకైక ప్రాణ బతికిన ప్రయాణికుడిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచారు. అతనిని ముఖ్యమైన సాక్షిగా పరిగణించి, విచారణలో కీలక సమాచారాన్ని అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే హాస్టల్ ప్రాంగణంలో చోటుచేసుకున్న మరణాలపై కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమానయాన భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కేంద్రం పలు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. AAIB నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే నిజమైన కారణాలు, అశ్రద్ధలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలపై స్పష్టత రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Raod Crack : చెన్నైలో ఒక్కసారిగా చీలిన రోడ్డు.. భయాందోళనలో ప్రజలు