DGCA : ఇటీవల ఎయిరిండియాకు సంబంధించిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై ప్రశ్నలు ఎత్తింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తక్షణమే అప్రమత్తమై ప్రధాన విమానాశ్రయాలపై సమగ్ర తనిఖీలకు శ్రీకారం చుట్టింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించినట్టు డీజీసీఏ వెల్లడించింది. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని రెండు బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన విమానాశ్రయాల్లో పరిశీలనలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సేఫ్టీ, ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కమ్యూనికేషన్, నేవిగేషన్ వ్యవస్థలు, ప్రీ-ఫ్లైట్ మెడికల్ చెకప్‌లు తదితర అంశాలను పక్కాగా పరిశీలించారు.
Read Also: Train fare hike: రైల్వే టికెట్ ఛార్జీల పెంపు.. జులై 1 నుంచి అమల్లోకి !
ఈ సందర్భంగా కొన్ని విమానాశ్రయాల్లో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. ఒక విమానాశ్రయంలో, అరిగిపోయిన టైర్లు కారణంగా ఓ దేశీయ విమానం అర్ధాంతరంగా ఆగిపోయిన ఘటన సంభవించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే, పలుచోట్ల విమానాల నిర్వహణలో పునరావృతంగా లోపాలు తలెత్తుతున్నాయని కూడా తెలియజేశారు. మరొక విమానాశ్రయంలో, ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఫ్లైట్ సిమ్యులేటర్ ప్రస్తుత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ కాలేదని, అదీ కాకుండా అది నిజమైన విమాన కాన్ఫిగరేషన్‌కు సరిపోకపోవడం గమనార్హం. ఈ అంశాలు విమానయాన సంస్థల పర్యవేక్షణలో లోపాల్ని సూచిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
విమానయాన భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా పేర్కొంటూ డీజీసీఏ, గుర్తించిన లోపాలపై సంబంధిత సంస్థలకు వివరాలు పంపినట్లు తెలిపింది. ఏ సంస్థలు ఈ లోపాలకు బాధ్యత వహించాలో ప్రస్తావించకపోయినా, వాటిని సరిచేయాల్సిన అవసరం తప్పనిసరి అని స్పష్టం చేసింది. డీజీసీఏ ప్రకటనలో ఈ తనిఖీలు భవిష్యత్తులో సమర్థవంతమైన విమానయాన వ్యవస్థ కోసం అవసరమైన మార్గదర్శక చర్యలు తీసుకునేందుకు మాకు సహాయపడతాయి. భద్రత విషయంలో మేం ఏ స్థాయిలోనూ రాజీపడము అని పేర్కొంది. ఈ చర్యలన్నీ, పౌరుల ప్రయాణ భద్రతను గణనీయంగా మెరుగుపరచే దిశగా సాగుతున్నాయి. విమానయాన రంగంలో నాణ్యతా ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశముంది.