జూన్ 12న జరిగిన బోయింగ్ AI 171 విమాన ప్రమాదం అనంతరం విధించిన ‘భద్రతా విరామం’ తరువాత, ఎయిర్ ఇండియా (Air India Flights) ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనుంది. తాజాగా ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మొదటిగా కొన్ని మార్గాల్లో విమానాలు తిరిగి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నుంచి అన్ని అంతర్జాతీయ రూట్లలో పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నట్టు స్పష్టం చేసింది. అహ్మదాబాద్ నుండి లండన్ (హీత్రూ) వరకు వారానికి మూడు సార్లు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో ఢిల్లీ-లండన్, ఢిల్లీ-జూరిచ్, ఢిల్లీ-టోక్యో, ఢిల్లీ-సియోల్ వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో తగ్గించిన సర్వీసులను పునరుద్ధరించారు. ఈ మార్గాల్లో విమానాల సంఖ్యను మళ్లీ పెంచుతూ ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలను అందించేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైంది.
Teenmaar Mallanna : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు
బెంగళూరు-లండన్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-టొరంటో, ముంబై-న్యూయార్క్ వంటి పలు ప్రధాన రూట్లలో సర్వీసులు తాత్కాలికంగా తగ్గించబడ్డాయి. అలాగే అమృత్‌సర్-లండన్ (గ్యాట్విక్), గోవా-లండన్ (గ్యాట్విక్), బెంగళూరు-సింగపూర్, పూణే-సింగపూర్ వంటి మార్గాల్లో సెప్టెంబర్ 30 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య విమానాలు రద్దైన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ బుకింగ్ లేదా పూర్తి డబ్బు తిరిగి పొందే అవకాశం కల్పిస్తోంది. సేవలలో మార్పులపై ఎయిర్ ఇండియా క్షమాపణలు తెలుపుతూ, భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. ఈ పాక్షిక పునరుద్ధరణతో ప్రస్తుతం ఎయిర్ ఇండియా వారానికి 525 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు నడుపుతుండడం విశేషం.