Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు

Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది.

  • Written By:
  • Updated On - January 10, 2024 / 04:05 PM IST

Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం వినూత్న రాజకీయ వ్యూహాలను రెడీ చేస్తోంది. ప్రత్యేకించి విపక్ష పార్టీలలోని బలమైన ఎంపీలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని రకాల మార్గాలను వాడుకోవాలని కమలదళం యోచిస్తోందని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఎన్నికల వ్యూహరచనపై  మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించింది. ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి తీసుకొచ్చే మిషన్‌తో ముడిపడిన  కీలక బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఈసందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అప్పగించారని తెలిసింది. విపక్ష ఎంపీల చేరికకు సంబంధించిన జాయినింగ్ కమిటీ బాధ్యతలను బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు అప్పగించారని సమాచారం.  ‘‘జాయినింగ్ కమిటీ ఇతర పార్టీల నుంచి ప్రభావవంతమైన నాయకులు, సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషిస్తుంది. నియోజకవర్గంలో నాయకుడి ప్రభావం, ఎన్నికల్లో గెలవగల సామర్థ్యం ఆధారంగా చేరికలపై నిర్ణయం తీసుకుంటుంది’’ అని బీజేపీ వర్గాలు(Target 400) తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లపై  బీజేపీ ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో తొలిసారిగా 400కుపైగా సీట్లను సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఆ రికార్డును అధిగమించాలనే లక్ష్యంతో బీజేపీ సన్నాహాలు చేస్తోంది.ఇక  2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్‌కు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, ప్రచార సంబంధిత పనులను సునీల్ బన్సల్, ఇతర ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షిస్తారు. దుష్యంత్ గౌతమ్ దేశవ్యాప్తంగా బౌద్ధుల సదస్సులను నిర్వహించి, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న పనుల గురించి వారికి చెబుతారు.

Also Read: Lord Sri Ram : ఇంట్లో రాముడి ఫొటో పెట్టేందుకు వాస్తు నియమాలివీ..

మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవ్య పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. మరోవైపు ఇండియా కూటమి సీట్ల పంపకాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో సీట్ల సర్దుబాటుపై ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చలు జరిపింది. ఇక మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై శివసేన, ఎన్సీపీలతో చర్చలు జరిపింది. మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో సీట్ల పంపకాలపై ఇండియా కూటమి నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.