Fake Currency : మన దేశ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ ఫొటో ఉంటుంది. అయితే ఇద్దరు కేటుగాళ్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయించారు. రూ.1.30 కోట్లు విలువైన ఈ ఫేక్ కరెన్సీ నోట్లను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ థక్కర్ వద్ద పనిచేసే భరత్ జోషి అనే ఉద్యోగికి ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు కేటుగాళ్లు బంగారం వ్యాపారి మెహుల్ థక్కర్ వద్ద 2,100 గ్రాముల బంగారాన్ని రూ.1.60 కోట్లకు కొన్నారు. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌లో రూ1.30 కోట్లు, రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌లో రూ.30 లక్షలను చెల్లిస్తామని మాట ఇచ్చారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆ ఇద్దరు కేటుగాళ్లు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లను(Fake Currency) ప్రింట్ చేయించారు. రూ.1.30 కోట్లు విలువైన ఫేక్ కరెన్సీ నోట్లను తీసుకొచ్చి బంగారం వ్యాపారి మెహుల్ థక్కర్ వద్ద పనిచేసే ఉద్యోగి (భరత్ జోషి)కి ఇచ్చి వెళ్లారు. మిగతా 30 లక్షల రూపాయలను త్వరలో ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు.
Also Read :KTR Vs Congress : హామీలు నెరవేర్చనందుకు రాహుల్, ప్రియాంక క్షమాపణ చెప్తారా ? : కేటీఆర్
అనంతరం అవి ఫేక్ కరెన్సీ నోట్లను గుర్తించిన మెహుల్ థక్కర్, భరత్ జోషి దీనిపై అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పుర పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సెప్టెంబరు 24న జరిగిన ఈ మోసంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ‘‘రూ.500 ఫేక్ నోట్లతో కూడిన మొత్తం 26 బండిళ్లను ఇద్దరు కేటుగాళ్లు బంగారం వ్యాపారి మెహుల్ థక్కర్‌కు ఇచ్చారు. ఆ ఫేక్ నోట్ల కట్టలను లెక్క పెట్టమని మెహుల్ థక్కర్ తన ఉద్యోగి భరత్ జోషికి ఇచ్చాడు. మేం మిగతా రూ.30 లక్షలు తీసుకొస్తామంటూ ఇద్దరు కేటుగాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భరత్ జోషి ఆ నోట్లను కరెన్సీ కౌంటింగ్ మెషీనులో వేయగా లెక్క పెట్టలేదు. ఎందుకు అని చెక్ చేయగా.. నోట్లపై అనుపమ్ ఖేర్ ఫొటో కనిపించింది’’ అని పోలీసులు ఈ కేసు గురించి వివరించారు. మెహుల్ థక్కర్ ఆఫీసు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.