Modi : మోడీ మెడకు మరింత బిగుసుకుంటున్న అదానీ ఉచ్చు

అదానీ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. మోదీ (Modi) రాజకీయ అస్తిత్వం మరోసారి బోనులో నిలబడింది.

  • Written By:
  • Updated On - September 1, 2023 / 12:25 PM IST

By: డా. ప్ర‌సాదమూర్తి

అదానీ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. మోదీ (Modi) రాజకీయ అస్తిత్వం మరోసారి బోనులో నిలబడింది. 2013 నుంచి 2018 మధ్యలో అదానీ సంస్థ ఎలా అక్రమంగా వేల కోట్లు ఆస్తిని సంపాదించుకుందో అనేకానేక ఆరోపణలు ఇంతకుముందే వెల్లువెత్తాయి. హిండెన్స్ బర్గ్ వెల్లడించిన నిజాలతో దేశం అట్టుడికి పోయిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఓసిసిఆర్పి (Organised Crime and Corruption Reporting Project) అనే సంస్థ వెల్లడించిన తాజా వివరాలు గతంలో హిడెన్స్ బర్గ్ వివరాలకు మరింత బలాన్ని, మరింత రుజువును చేకూర్చే విధంగా ఉన్నాయి. అయితే ఆదానీ సంస్థ వారు మాత్రం అబ్బే.. ఇది సరాసరి, ఆమూలాగ్రం, అణువణువూ అబద్ధమని, గతంలో వచ్చిన ఆరోపణలనే ఈ సంస్థ మళ్లీ రిపీట్ చేసిందని తమ ఖండనలో పేర్కొన్నారు.

ఉనికిలో లేని కంపెనీలు, అంటే డొల్ల కంపెనీలను సృష్టించి వాటి ద్వారా తమ కంపెనీలో పెట్టుబడి పెట్టించి, తమ షేర్ల విలువను అనూహ్యంగా పెంచుకొని అదాని గ్రూపు అక్రమాలకు పాల్పడిందనేది హిండెన్స్ బర్గ్ వెలువరించిన సంచలన నిజాలు. దీనిమీద ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే సుప్రీంకోర్టు కమిటీ ఏర్పడింది. సుప్రీంకోర్టు కూడా సెబీ ఇచ్చిన అరకొర నివేదికతో నిర్ణయాలకు రావలసి వచ్చింది పలువురు విశ్లేషకులు అభిప్రాయం. దాన్ని తమ ఘనవిజయంగా, తమకు దక్కిన క్లీన్ చిట్ గా అదానీ ప్రచారం చేసుకొని అందరి నోళ్ళూ మూయించడానికి ప్రయత్నం చేశారు.

కానీ ఓసిసిఆర్పీ బయట పెట్టిన తాజా నిజాలు చూస్తుంటే, అదాని ఇంతింతై.. అంతై.. దేశంలోని పాలనా సంస్థనే గుప్పిట పెట్టుకుని, కీలక ఆర్థిక శక్తిగా ఎదిగి పోవడం వెనక ఆయన సంస్థ చేసిన అక్రమాలు దాగి ఉన్నాయన్నది అదానీ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణల సారాంశం. ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి వార్తా సంస్థలు ఈ వివరాలను మరింత విపులంగా రాసినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలను బట్టి అదానీ ఆక్రమాల్లో కీలకంగా కనిపిస్తున్నవి పరాయి దేశాల వ్యక్తులతో షేర్ గేమ్ ఆడి సంస్థ ఆదాయాన్ని పెంచుకున్న విషయం. యూఏఈ, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్ ల నుంచి అదానీ గ్రూప్ ఆర్థిక అక్రమ క్రీడా వైభవం మహోన్నతంగా కొనసాగినట్టు తాజా వివరాలు చెప్తున్నాయి‌. ఇందులో యూఏఈ కి చెందిన నాజర్ అలీ షాబాన్ అలీ, తైవాన్ కి చెందిన చుంగ్ చాంగ్ లింగ్ అనే వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వీరే షేర్లు కొనడం, షేర్ల విలువను వందల రెట్లు పెంచడం అనే చీకటి వ్యాపార విన్యాసాన్ని వేయి చేతులతో సాగించారట. వీరిద్దరూ అదానీ గ్రూప్లో డైరెక్టర్లుగా కూడా ఉన్నారనుకోండి. అదేమంత హాశ్చర్యపడాల్సిన పనేం కాదు కదా. గౌతమ్ అదాని సోదరుడు వినోద్ అదానీ ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అట. వెలుగు చూసిన నిజాలు ఇలా ఉన్నాయి. మరి దీని మీద విచారణ ఎందుకు పూర్తిస్థాయిలో జరగలేదు? జరిగితే అసలు ఏం జరిగింది ?ఒకసారి క్లుప్తంగా గతాన్ని చూద్దాం.

మోదీ (Modi) ప్రధాని కాకముందే అదానీ సంస్థలో సాగుతున్న అక్రమాల పట్ల DRI అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీడీలతో సహా సెబీకి ఆధారాలు అందించింది. సెబీ విచారణ కూడా సాగించింది. కానీ సెబీ విచారణ చేసిన విషయాన్ని కూడా అంధకారంలో ఉంచారు. తర్వాత సుప్రీంకోర్టు కమిటీకి అందించిన నివేదికలో సెబీ అదానీ గ్రూపుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక్కడ మనం గుర్తించాల్సింది సెబీ డైరెక్టర్ గా అప్పట్లో వ్యవహరించిన యూకే సిన్హా 2017 వరకు కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో ఏం విచారణ జరిగింది.. ఏ నిజాలు బయటపడ్డాయి అనేది అంతా అగమ్యగోచరంగా ఉంచారు. కానీ ఒకప్పుడు సెబీకి డైరెక్టర్ గా ఉన్న సిన్హా అదానీ హస్తగతం చేసుకున్న ఎన్డీటీవీకి అకస్మాత్తుగా డైరెక్టర్, చైర్మన్ పదవులను అలంకరించారు. మరి దీని మర్మమేమి తిరుమలేశా అంటే, మర్మం చెప్పడానికి తిరుమలేశుడే దిగి రానవసరం లేదు కదా.

అంతేకాదు అదానీ సంస్థ సాగించిన అక్రమ షేర్ వ్యాపార లావాదేవీలలో అత్యంత కీలకమైన ఇద్దరు విదేశీయులలో చుంగ్ చాంగ్ లింగ్ అనే వ్యక్తి చైనీయుడు. చైనాతో మనకున్న సంబంధాలు ఎలాంటివో మనకు తెలుసు. రక్షణ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోళ్ల విషయంలో అదానీ పాత్ర ఏమిటో తెలుసు. మరి ఆదానీ గ్రూపు వెనుక ఒక చైనీయుడి హస్తం ఏమిటి? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. సాధారణ ప్రజలకు ఏమీ అర్థం కాదు. సిలెండర్ 200 తగ్గిందంటే గెంతులేసే వాళ్ళు, ఈ పదేళ్లలో ఎంత పెరిగిందో ఆలోచించడానికి కూడా క్షణం కేటాయించారు. చంద్రయాన్ చంద్రుడు మీద అడుగు పెట్టిందంటే అదంతా శివశక్తి మహిమ అని, మోదీ (Modi) కటాక్షం అని భ్రమలో మునిగిపోయే ప్రజలు, ఆర్థికపరంగా ఈ దేశాన్ని కుదేలు చేసిన అతి పెద్ద కుంభకోణం గురించి ఆలోచించే తెలివైన వారు కాదు.

అందుకే మేధావులు, పాత్రికేయులు, విపక్షాల నాయకులు ఈ విషయాన్ని దేశం ముందు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముంబైలో ప్రతిపక్షాల కూటమి సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ మీడియా సమావేశం పెట్టి, మోదీని నిలదీశారు. అదానీ గ్రూపు విషయంలో మోదీ వెతక వైఖరి ఏమిటి అని ఆయన ప్రశ్న. దీనిమీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్షాల డిమాండ్. చూడాలి. మోదీ, అదానీని ఆదుకోవడానికి తన ఉనికికే ప్రమాదకరమైన సాహసానికి ఒడికడతారా.. లేక ప్రతిపక్షాల డిమాండ్ ప్రకారం పార్లమెంట్ జాయింట్ కమిటీ వేసి కాలాన్ని కాస్త ముందుకు నెడతారా.. ఏం చేస్తారో చూడాలి. ఏది ఏమైనా అదానీ వ్యవహారం మోదీకి గుదిబండగా మారింది. ఆ ఉచ్చు రాను రానూ బిగుసుకుంటోంది. ఈ ఆరోపణలను ఆదానీ సంస్థ పచ్చి అబద్ధాలుగా కొట్టి పారేయవచ్చు. మోదీ మాత్రం అంత తేలికగా ఈ వ్యవహారాన్ని తీసుకుంటే ఏం జరుగుతుందో ఆయనకు మాత్రం తెలియదా? ఇలాంటి విషయాలలో దేశం దృష్టి మరల్చడానికి ఆయన వద్ద అనేక ఆస్త్రాలు ఉండనే ఉన్నాయి.

Also Read:  Telangana Politics : తుమ్మలతో రేవంత్ భేటీ..ఇక ఖమ్మంలో కాంగ్రెస్ కు తిరుగులేనట్లే..!