Site icon HashtagU Telugu

Attack On Kejriwals Car : కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఇది ఎవరి పని ?

Attack On Kejriwals Car Delhi Polls Bjp

Attack On Kejriwals Car : ఢిల్లీ ఎన్నికల పోలింగ్ తేదీ (ఫిబ్రవరి 5) సమీపించిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వాహన కాన్వాయ్‌పైకి కొందరు రాళ్లు విసిరారు. ఇవాళ ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గం (న్యూఢిల్లీ) పరిధిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ దాడి జరిగింది.  దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం.. కేజ్రీవాల్ కాన్వాయ్‌లోని వాహనాలపై రాళ్లు పడ్డాయి.  ఈ దాడి బీజేపీ కార్యకర్తల పనే అని ఆప్ ఆరోపిస్తోంది. బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నందు వల్లే కుట్రపూరితంగా  ఈ దాడి చేయించిందని పేర్కొంది. ‘‘న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో గెలవబోయేది కేజ్రీవాలే అని బీజేపీ గ్రహించింది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న పర్వేశ్‌ వర్మకు(Attack On Kejriwals Car) చెందిన గూండాలే కేజ్రీవాల్ కాన్వాయ్‌పైకి రాళ్లు విసిరారు’’ అని ఆప్ పేర్కొంది. ‘‘ఇలాంటి దాడులకు ఆప్ వెరవదు. ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారు’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆప్ ఒక ట్వీట్ చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

Also Read :Bihar Next CM : లాలూ కుమారుల ఢీ.. ‘‘నెక్ట్స్ సీఎం నేనే’’ అంటూ తేజ్‌ప్రతాప్ సంచలన వీడియో

ఈ అంశంపై స్పందించిన బీజేపీ.. ఆప్‌ ఆరోపణలను ఖండించింది. ‘‘కేజ్రీవాల్‌ కాన్వాయ్‌ ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఆ ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తరలించారు. వారిని పరామర్శించేందుకు నేను ఆస్పత్రికి వెళ్తున్నా. ఎన్నికల్లో ఎదురుకాబోతున్న ఓటమి గురించి ఆలోచిస్తూ, ప్రజల ప్రాణాల విలువను కేజ్రీవాల్ మర్చిపోయారు’’ అని పేర్కొంటూ బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌ వర్మ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

Also Read :Jupiter 125 CNG : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌.. ‘జూపిటర్‌ 125 సీఎన్‌జీ’ ఫీచర్లు ఇవీ

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్లను లెక్కిస్తారు. గతంలో వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఆప్ గెలిచింది. వరుసగా మూడో సారి గెలిచి ఢిల్లీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఆప్ ఉంది. ఈసారి తామేంటో నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది.