దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకు కాకరేపుతుంది. అధికార , ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ మ్యానిఫెస్టో లను విడుదల చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా రూపొందించబడింది. యువత, మహిళలు, వృద్ధులు, కిరాయిదారులు, విద్యార్థులు వంటి ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని హామీలు ఇవ్వడం ద్వారా మరోసారి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆప్ పట్టుదలగా ఉంది.
TGSRTC : ఆర్టీసీలో సమ్మె సైరన్..డిమాండ్స్ ఇవే..!!
యువత, మహిళల కోసం ప్రత్యేక హామీలు :
యువతకు ప్రాధాన్యతనిస్తూ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆప్ ప్రకటించింది. అలాగే, మహిళల కోసం ‘మహిళా సమ్మాన్ యోజన’ కింద నెలకు రూ.2,100 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. వృద్ధులకు ‘సంజీవని పథకం’ కింద ఉచిత వైద్యం అందించడమే కాకుండా, అవసరమైన సహాయాలను ప్రభుత్వం అందించనున్నట్లు హామీ ఇచ్చింది.
రోడ్ల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ :
యూరప్ తరహాలో ఢిల్లీ రోడ్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన ఆప్, మెట్రో ప్రయాణంలో 50% రాయితీతో పాటు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. యమునా నదిని శుభ్రం చేయడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంపై కూడా మ్యానిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చింది.
ఉచిత కరెంట్ :
కిరాయిదారులకు ఉచిత కరెంట్, నీటి సరఫరా వంటి సౌకర్యాలు అందించడంతో పాటు ఆటో, టాక్సీ డ్రైవర్ల పిల్లలకు ఉచిత కోచింగ్ మరియు వివాహాల కోసం ఆర్థిక సాయం ప్రకటించడం ద్వారా ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18,000 ఆర్థిక సాయం హామీ ఇచ్చింది.
హ్యాట్రిక్ విజయంపై దృష్టి :
గత ఎన్నికల్లో 2015లో 67 సీట్లు, 2020లో 62 సీట్లతో ఘన విజయం సాధించిన ఆప్, ఈసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో తమ మ్యానిఫెస్టోను సిద్ధం చేసింది. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఇచ్చిన హామీలను నిజంగా అమలు చేస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో నాటేందుకు ఆప్ చేసిన ప్రయత్నం ఫలితాన్నిచ్చేలా కనిపిస్తోంది. ఈ మ్యానిఫెస్టో ప్రజలను ఆకర్షించడంలో ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.