Ayodhya Ram Temple: అయోధ్యలోని రామ్ జన్మభూమి ప్రాంగణంలో శనివారం ఉదయం ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. భారీ భద్రతా వలయం ఉన్నప్పటికీ ఒక వ్యక్తి ఆలయ ప్రాంగణంలో నమాజ్ చేయడానికి ప్రయత్నించగా భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటనతో అయోధ్య, పరిసర ప్రాంతాల్లో భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి.
అసలేం జరిగింది?
శనివారం ఉదయం రామ్ మందిర్ దక్షిణ ‘పర్కోట’ (ప్రహరీ గోడ) వద్ద ఒక యువకుడు నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోగా, ఆ యువకుడు నినాదాలు చేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు సెక్యూరిటీ సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
Also Read: నెట్స్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!
పోలీసుల విచారణ
నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి నిఘా సంస్థలు, స్థానిక పోలీసులు విచారిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అతను ఎలా ప్రవేశించాడు? దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. సదరు యువకుడు కాశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అని, ఘటన సమయంలో అతను కాశ్మీరీ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నాడని సమాచారం. అయితే పోలీసులు ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
మౌనంగా ఉన్న అధికారులు
ఈ సున్నితమైన అంశంపై అయోధ్య జిల్లా యంత్రాంగం, రామ్ మందిర్ ట్రస్ట్ అధికారులు ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. యూపీ పోలీసులతో పాటు పారా మిలిటరీ బలగాలు కాపలా ఉండే ఇంతటి కట్టుదిట్టమైన ప్రాంతంలోకి వ్యక్తి చొరబడటం భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అయోధ్యలో నాన్-వెజ్ అమ్మకాలు, ఆన్‌లైన్ డెలివరీపై నిషేధం
మరోవైపు అయోధ్యలో నాన్-వెజ్ ఆహార పదార్థాల అమ్మకాలు, ఆన్‌లైన్ డెలివరీపై శుక్రవారం నుండి నిషేధం విధించారు. రామ్ మందిర్, పంచకోశి మార్గంలో మాంసం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని యంత్రాంగం ఆదేశించింది. పర్యాటకులు హోటళ్లలో ఫుడ్ యాప్స్ ద్వారా నాన్-వెజ్ ఆర్డర్ చేస్తున్నారని, దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేస్తామని హెచ్చరించారు. రెస్టారెంట్లు, దుకాణాలు, హోమ్‌స్టేలలో నాన్-వెజ్ వండటం లేదా వడ్డించడం పూర్తిగా నిషేధించబడింది. ఫుడ్ డెలివరీ యాప్‌లకు కూడా అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
