Site icon HashtagU Telugu

Crorepati MLAs : 90 మంది ఎమ్మెల్యేల్లో 86 మంది కోటీశ్వరులే.. సగటు ఆస్తి పాతిక కోట్లు

Crorepati Mlas Haryana Legislators Criminal Cases Adr

Crorepati MLAs : హర్యానాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తిపాస్తులు, నేరచరితకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR), హర్యానా ఎలక్షన్ వాచ్ కీలక వివరాలను వెల్లడించాయి. దీని ప్రకారం.. హర్యానాలో ఎన్నికైన మొత్తం 90 మంది ఎమ్మెల్యేలలో 86 మంది కోటీశ్వరులే (Crorepati MLAs). మొత్తం ఎమ్మెల్యేలలో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలోని సమాచారం ఆధారంగా ఈ నివేదికను ఏడీఆర్ విడుదల చేసింది.

Also Read :World University Rankings : ప్రపంచ టాప్ వర్సిటీల జాబితాలోని భారత విద్యాసంస్థలివే..

ఏడీఆర్ నివేదికలోని కీలక వివరాలివీ.. 

  • హర్యానా ఎమ్మెల్యేలలో కోటీశ్వరుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరిగింది.  2019లో ఎన్నికైన ఎమ్మెల్యేలలో 93 శాతం మందే కోటీశ్వరులు. కానీ ఈసారి ఎన్నికైన వారిలో96 శాతం మంది కోటీశ్వరులు.
  • హర్యానాలోని 90 మంది ఎమ్మెల్యేలలో 44 శాతం మంది వద్ద రూ.10 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. కేవలం 2.2 శాతం మంది వద్ద  రూ.20 లక్షలలోపు ఆస్తులు ఉన్నాయి.
  • ఈ రాష్ట్రంలో గెల్చిన ప్రతీ అభ్యర్థి సగటు ఆస్తి రూ. 24.97 కోట్లు..  2019లో గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ. 18.29 కోట్లు మాత్రమే.
  • పార్టీల వారీగా చూస్తే.. బీజేపీ ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 95 శాతం మంది, ఐఎన్‌ఎల్‌డీ, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలలో 100 శాతం మంది  కోటీశ్వరులు.
  • హర్యానాలో ఈసారి ఎన్నికైన అత్యంత ధనిక ఎమ్మెల్యే  సావిత్రీ జిందాల్. ఆమె హిసార్‌ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ. 270 కోట్లు. బీజేపీ ఎమ్మెల్యే శక్తి రాణి శర్మ ఆస్తి రూ. 145 కోట్లు, ఎమ్మెల్యే శృతి చౌదరి ఆస్తి రూ. 134 కోట్లు.
  • ఈ ఎన్నికల్లో రెండోసారి 30 మంది ఎమ్మెల్యేలుగా తిరిగి ఎన్నికయ్యారు.  అయితే వీరందరి సగటు ఆస్తులు 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 59 శాతం మేర పెరగడం గమనార్హం. సగటున ఈ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి ఆస్తి దాదాపు రూ.9.08 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 14.46 కోట్ల దాకా పెరిగింది.
  • కొత్త ఎమ్మెల్యేలలో 12 మంది నేర చరితులు. వీరిలో ఆరుగురు తీవ్ర నేర అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఒక ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు ఉంది. 2019లో గెలిచిన ఎమ్మెల్యేలలో ఏడుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
  • పార్టీల వారీగా చూస్తే..  19 శాతం మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 6 శాతం బీజేపీ ఎమ్మెల్యేలు, 67 శాతం స్వతంత్ర అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.