DGCA : ఎయిరిండియా విమానం ఇటీవల ఎదుర్కొన్న ప్రమాద ఘటన విమానయాన రంగాన్ని లోతుగా ఆలోచించుకునేలా చేసింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎయిర్‌లైన్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. తమ విమానాల ఇంజిన్ వ్యవస్థలు, ఇంధన స్విచ్‌లు, ఇతర కీలక సాంకేతిక అంశాలపై మరింత కఠినమైన తనిఖీలు చేపట్టుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కింద పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా విడుదల చేసిన నివేదికలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల్లో మొత్తం 65 ఇంజిన్ వైఫల్యాలు నమోదయ్యాయి. అంతేకాక, 2024 జనవరి 1 నుండి 2025 మే 31 వరకు 11 మే డే (Mayday) కాల్స్ వచ్చినట్లు DGCA తెలిపింది.
మే డే అంటే ఏమిటి?
ముప్పు ముంచుకొచ్చినప్పుడు విమానాలు లేదా నౌకలపై ప్రయాణిస్తున్న వారిని రక్షించేందుకు పైలట్లు పంపే అత్యవసర సంకేతమే “మే డే”. ఇంజిన్ ఫెయిల్యూర్, ఇంధన సరఫరాలో అంతరాయం, విద్యుత్ సమస్యలు వంటి ఘటనల సమయంలో ఈ సంకేతం పంపబడుతుంది. అయితే, వచ్చిన 11 మే డే కాల్స్ సమయంలో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ఆయా విమానాలను సురక్షితంగా భూమికి చేర్చారు. ప్రమాదాలను సమర్థంగా నివారించడం సాంకేతిక నిపుణుల అభినందనకు పాత్రంగా మారింది.
ప్రమాదాల వెనుక ఉన్న అసలు కారణాలు
భారత పైలట్ల సమాఖ్య అధ్యక్షుడు కెప్టెన్ సీఎస్ రాంధవా మాట్లాడుతూ..విమాన ప్రమాదాలకు ప్రధానంగా ఇంధన ఫిల్టర్ల బ్లాక్ కావడం, టర్బైన్ లోపాలు, ఇంధన కాలుష్యం, లేదా ఇంజిన్‌కి ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోవడం వంటి సమస్యలే కారణమవుతున్నాయని చెప్పారు. చాలా సందర్భాల్లో పైలట్లు తక్షణ స్పందనతో సమస్యను పరిష్కరిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో పరిస్థితి వారి నియంత్రణకు బయట ఉండొచ్చని ఆయన హెచ్చరించారు.
భారత విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు
DGCA ఎయిర్ సేఫ్టీ డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తటం సాధారణమే అయినా, భారతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో ఇవి తరచూ నమోదవుతున్నాయి. ఇది మన విమానయాన రంగ భద్రతపైనే ప్రశ్నలను తీసుకొస్తోంది అని అన్నారు. ఇంధన స్విచ్ విఫలమవడం వల్లే ఎయిరిండియా విమానం కూలినట్టు ప్రాథమిక నివేదికలో వెల్లడికాగా, ఈ అంశంపై DGCA మరింత దృష్టి పెట్టింది. అన్ని భారతీయ సంస్థలు తమ బోయింగ్ 787 మరియు 737 రకాల విమానాల్లో ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని ఆదేశించింది.
భారత ఎయిర్‌లైన్స్ సంస్థలు మరింత అప్రమత్తం
ప్రస్తుతం భారతదేశంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ్ ఎయిర్, స్పైస్‌జెట్ వంటి ప్రముఖ సంస్థలు బోయింగ్ 787, 737 రకాలను నడుపుతున్నాయి. ఎయిరిండియా ఘటన తర్వాత ఈ సంస్థలు తక్షణ చర్యలు తీసుకుంటూ తమ విమానాలకు పూర్తి టెక్నికల్ చెకప్ నిర్వహిస్తున్నాయి.
భద్రతే ప్రథమ ప్రాధాన్యత
ప్రతి ప్రయాణికుడి జీవితం విలువైనది. ఎయిర్‌లైన్ సంస్థలు వ్యాపార దృష్టికన్నా ముందుగా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది. DGCA సూచించిన మార్గదర్శకాలు, సంస్థల చురుకైన స్పందన, మరియు పైలట్ల శిక్షణ వంటి అంశాలు కలిస్తేనే, భారత విమానయాన రంగం భద్రత పరంగా మరింత నమ్మకాన్ని సాధించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.