దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ప్రాణాలు జరుగుతూనే ఉన్నాయి. గత పది రోజుల్లోనే దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రహదారి ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ రహదారిపై దూసుకొచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పది మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతమవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.
Amla Facts: ఉసిరికాయను ఆ టైమ్ లో తింటున్నారా.. అయితే ఆ దోషం చుట్టుకున్నట్లే!
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరగడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అతివేగం, నిద్రమత్తులో డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, రహదారుల దయనీయ స్థితి, తగిన రోడ్డు భద్రతా చర్యల లోపం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 20మంది, రాజస్థాన్లో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 15మంది, అలాగే బాపట్లలోని సత్యవతిపేట వద్ద కారు ప్రమాదంలో 4మంది ప్రాణాలు కోల్పోవడం ఈ పరిస్థితుల తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తుంది.
ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణ భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ప్రభుత్వం, రవాణా శాఖ, పోలీసు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బస్సు డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలు, రోడ్డు నియమాల కఠిన అమలు, వాహనాల సాంకేతిక తనిఖీలు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. రహదారుల అభివృద్ధి, సిగ్నల్ వ్యవస్థల బలోపేతం, మరియు ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను ప్రాధాన్యతగా తీసుకోకపోతే ఇలాంటి విషాదాలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
