Maoists Hunting: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవుల్లో దాక్కున్న వందలాది మంది మావోయిస్టులపై భద్రతా బలగాలు గురిపెట్టాయి. తెలంగాణలోని కర్రెగుట్టలు, ఛత్తీస్‌గఢ్‌లోని నీలం సరాయ్ కొండల చుట్టూ భారీగా భద్రతా బలగాల పహారా ఉంది. కూంబింగ్ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఐదుగురు మావోయిస్టులు మరణించారని తెలిసింది. దాదాపు 300 మంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతలు ప్రస్తుతం కర్రెగుట్టలు, నీలం సరాయ్ కొండల్లో ఉన్నారని తెలుస్తోంది. హిడ్మా, దేవా, వికాస్ లాంటి కీలక మావోయిస్టు నేతలు ఇక్కడికి వచ్చారని సమాచారం. తెలంగాణ-మహారాష్ట్ర-ఆంధ్ర కేంద్ర కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, ఆర్గనైజేషన్ సెక్రటరీ స్థాయి నేతలు ఈ అడవుల్లో ఉన్నారు. మావోయిస్టులకు చెందిన బెటాలియన్ నంబర్ 1, 2, ఇతర యూనిట్లు ఈ అడవుల్లో(Maoists Hunting) యాక్టివ్‌గా ఉన్నాయి. అందుకే ఆ అడవుల్లో గత 72 గంటలుగా భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read :Advanced Chat Privacy: వాట్సాప్‌లో ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఫీచర్.. ఏమిటిది ?
5వేల మంది వర్సెస్ 300 మంది
భద్రతా బలగాల టీమ్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్, బస్తర్‌కు చెందిన బస్తర్ ఫైటర్స్, మహారాష్ట్రకు చెందిన సీ60 కమాండోలు, ఆంధ్రకు చెందిన గ్రేహౌండ్స్ ఫోర్స్ సైనికులు, వాయుసేనకు చెందిన పైలట్లు ఉన్నారని తెలిసింది. మొత్తంగా దాదాపు 5 వేల మంది భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. భారత వాయుసేనకు చెందిన MI17 హెలికాప్టర్లతో అడవులను జల్లెడ పడుతున్నారు. అడవుల్లోని ఏయే ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నారు. దాని ఆధారంగా మ్యాపింగ్‌ను తయారు చేసుకొని.. మావోయిస్టులను చుట్టుముట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసు విభాగాలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి.
ఆహారం, నీరు లేని దుస్థితిలో మావోయిస్టులు..
మావోయిస్టుల వద్ద తగినంత ఆహారం కానీ, నీరు కానీ లేవని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. అందుకే కర్రెగుట్టలు, నీలం సారాయ్ కొండల నుంచి మావోయిస్టులు బయటికి వెళ్లకుండా దిగ్బంధనం చేస్తున్నారు. ఈ గుట్టల చుట్టూ ఉన్న భద్రతా బలగాలకు ఆహారాన్ని చేరవేసేందుకు హెలికాప్టర్లను వాడుతున్నారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా ఐటీబీపీ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో నెలంగూర్ కంపెనీ ఆపరేటింగ్ బేస్ (COB)ను ఏర్పాటు చేశారు. అబూజ్‌మడ్ ప్రాంతంలోని నక్సల్స్ బలమైన స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఈ బేస్ ఎంతో దోహదం చేయనుంది.
Also Read :BRS Party : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ?
పెద్దపెద్ద మావోయిస్టు నేతలపై గురి : విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్‌గఢ్ సీఎం
‘‘ గత 15 నెలలుగా భద్రతా బలగాలు మావోయిస్టులతో వీరోచితంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఒక పెద్ద ఆపరేషన్ జరుగుతోంది. పెద్ద పెద్ద మావోయిస్టు నేతల ఏరివేతపై ఫోకస్ పెట్టారు. దాని వివరాలు బయటికి వచ్చేవరకు వేచిచూద్దాం’’ అని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి చెప్పారు.