Para Commandos : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులను వేటాడేందుకు దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను కశ్మీర్‌లో మోహరిస్తామని రక్షణ శాఖ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. కశ్మీర్‌లోకి చొరబడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాదాపు 55 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను గుర్తించి అంతం చేయడమే పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోల(Para Commandos) లక్ష్యం.
We’re now on WhatsApp. Click to Join
పాకిస్తాన్‌లో అత్యంత శిక్షణపొందిన ఉగ్రవాదులు(Pakistani Terrorists) కశ్మీర్‌లోకి చొరబడ్డారని భారత నిఘా వర్గాల నుంచి భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ సమాచారానికి అనుగుణంగా కశ్మీర్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ మోహరింపును కొనసాగిస్తున్నాయి. దీంతోపాటు పాకిస్తాన్ ఉగ్రవాదులకు కశ్మీర్‌లో సహాయ సహకారాలను అందిస్తున్న వారి వివరాలను కూడా కూడగట్టే పనిలో భారత నిఘా విభాగాలు ఉన్నాయి. తద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేందుకు భారత భద్రతా బలగాలు రెడీ అవుతున్నాయి. సరిహద్దుల నుంచి కశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునేందుకు భారత సైన్యం ఇప్పటికే దాదాపు 3,500 నుంచి 4000 మంది సిబ్బందితో ఒక బ్రిగేడ్‌ను బార్డర్‌లో మోహరించింది. సరిహద్దుల్లో నిఘా కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తున్నారు. అత్యాధునిక ఆయుధాలను బార్డర్‌లో సిద్ధంగా ఉంచారు.
Also Read :Age Vs Sleep : ఏ వయసు వారు.. రోజూ ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ ట్రైనింగ్ ఇస్తోందని భారత ఆర్మీ భావిస్తోంది. అక్కడే ఉగ్రవాదుల ప్రధాన మౌలిక సదుపాయాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ప్రస్తుతం పీఓకేపై కూడా భారత్ ఫోకస్ చేసిందని చెబుతున్నారు. అంటే రానున్న రోజుల్లో పాక్ ఉగ్రమూకలకు ముక్కుతాడు వేసేందుకు భారత్ ఎలాంటి ఆపరేషన్ అయినా చేపట్టే అవకాశం లేకపోలేదు. కశ్మీర్‌లో ఉగ్రదాడులు ఆపడం ద్వారా అక్కడి ప్రజల జీవనానికి భరోసా ఇవ్వాలని సైన్యం భావిస్తోంది. ఈక్రమంలో కశ్మీర్ యువత కూడా సైన్యంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల దోడా జిల్లా అడవుల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో స్థానిక యువత కూడా తుపాకులు చేతపట్టి పాల్గొనడం గమనార్హం.