Naxalites Surrender : ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో సోమవారం 25 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల పిలుపునకు స్పందించి 25 మంది నక్సల్స్ సోమవారం నాడు లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డు కూడా ఉంది. నిషేధిత కమ్యూనస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మవోయిస్ట్)కు చెందిన గాంగ్లూరు, భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సభ్యులుగా ఈ 25 మంది మావోయిస్టులు చురుకుగా పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, లొంగిపోయిన ఇద్దరు మహిళా నక్సలైట్లు, మహేష్ తేలం అనే మరో నక్సలైట్‌పై రూ.8 లక్షల రివార్డు ఉందని, 2012 నుంచి వీరు చురుకుగా ఉద్యమంలో పనిచేస్తున్నారని బిజాపూర్ ఎస్‌పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. 2020లో సుఖ్మాలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన, 2021లో బిజాపూర్‌లో 22 మంది భద్రతా సిబ్బంది మృతికి కారణమైన దాడిలో మహిళా నక్సలైట్ మాడ్కం ప్రమేయం ఉందని తెలిపారు. మరో ఇద్దరు నక్సల్స్ మోనుపై రూ.3 లక్షలు, జైదేవ్ పోడియంపై రూ.1, గుడ్డు కకెమ్, సూదరు పూనెమ్‌లపై చెరో రూ.10,000 చొప్పున రివార్డు ఉన్నట్టు చెప్పారు. మావోయిస్టు సిద్ధాంతాలు, గిరిజనులపై జరుగుతున్న అకృత్యాలతో విసిగిపోయి వీరంతా లొంగిపోయినట్టు తెలిపారు. లొంగిపోయిన వారికి రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పునరావాసం కల్పిస్తామన్నారు. తాజా లొంగుబాట్లతో ఈ ఏడాది జిల్లాలో లొంగిపోయిన నక్సల్స్ సంఖ్య 170 మందికి చేరిందని, ఇదే సమయంలో జిల్లాలోని 346 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.