Site icon HashtagU Telugu

Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్రలో అంతుచిక్క‌ని వ్యాధితో మృత్యువాత ప‌డుతున్న గుర్రాలు, కంచర గాడిదలు.. ఉత్త‌రాఖండ్ స‌ర్కార్‌ కీల‌క నిర్ణ‌యం

Kedarnath Yatra

Kedarnath Yatra

Kedarnath Yatra: ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాల‌యం ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారిని ద‌ర్శించుకునేందుకు భారీగా భ‌క్తులు పోటెత్తుతున్నారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలతో కలిసి చార్‌ధామ్ యాత్రలో ఒక భాగం. ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను హిందువులు దర్శించుకోవడం చాలా పవిత్రంగా భావిస్తారు. కేదార్‌నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ ఆల‌యం సముద్ర మట్టానికి 3వేల 583 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మందాకిని నది ఒడ్డున నెలవైవున్న కేదార్‌నాథ్‌ ఆలయం.. ఆరు నెలలపాటు మంచులోనే ఉంటుంది. దాదాపు ఏడాది అంతా మూసి ఉండే కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు.. వేసవి కాలంలో మాత్రమే తెరుచుకుంటాయి. ఆలయ తలుపులు తెరిచి ఉండే ఈ కొద్దిరోజుల్లోనే కేదార్‌నాథ్‌ క్షేత్రంలోని శివుడిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లివెళ్తారు.

Also Read: Coke Studio : భారత్, వివిధ సంగీత శైలుల సంగమాన్ని జరుపుకునే ఐకానిక్ వేదిక

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ లో మనుషులను, వారి సామాగ్రిని తరలించేందుకు గుర్రాలు, కంచ‌ర గాడిదలను ఉప‌యోగిస్తారు. అయితే, యాత్రా మార్గంలో రెండు రోజుల వ్య‌వ‌ధిలో అంతుచిక్క‌ని వ్యాధితో 14 గుర్రాలు, కంచ‌ర గాడిలు మృత్యువాత ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో యాత్రా మార్గంలో ఈ జంతువుల వినియోగంపై 24గంట‌ల పాటు ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. గుర్రాలు, కంచర గాడిదలపై నిషేధం నేప‌థ్యంలో యాత్రికులు కాలినడకన, పల్లకీ, ‘దండి – కంది’ ద్వారా ప్రయాణించాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. జంతు నిర్వాహకులు 24 గంటలు యాత్ర మార్గంలో తమ జంతువులను నడపవద్దని, ఎవరైనా అలా చేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Also Read: Curd: ప్రతిరోజు పెరుగు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ఉత్త‌రాఖండ్ ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ కార్య‌ద‌ర్శి బీవీఆర్సీ పురుషోత్తం మాట్లాడుతూ.. “నిన్న ఎనిమిది గుర్రాలు, కంచర గాడిదలు చనిపోయాయి, ఈరోజు ఆరు చనిపోయాయి. వాటి మ‌ర‌ణాల వెనుక ఉన్న కారణాన్ని మేము నిర్ధారించాలనుకున్నాము. కేంద్రం నుండి ఒక బృందం కూడా వాటి మరణాలకు కారణాన్ని తనిఖీ చేయడానికి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం, వైరస్ సోకిన గుర్రాలు, కంచర గాడిదలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాము. 2010లో ఇలాంటి పరిస్థితులలో యాత్ర ఆగిపోయిందని పురుషోత్తం అన్నారు. కానీ, ఈసారి యాత్రను ఆపబోము. మేము అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. వ్యాధి సోకిన గుర్రాలను యాత్రకు దూరంగా క్వారంటైన్‌లో ఉంచుతున్నామ‌ని పేర్కొన్నారు.

 

మ‌రోవైపు.. మే 1న కేదార్‌నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. యాత్రికులకు అనుకూలమైన ప్రయాణ ఎంపికను అందించడానికి ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్ నుండి సేవలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ టిక్కెట్లు IRCTC లో అందుబాటులో ఉన్నాయి, ఆఫ్‌లైన్ టిక్కెట్లను జిల్లా మేజిస్ట్రేట్ కానీ, సెక్టార్ మేజిస్ట్రేట్ ద్వారా పొందవచ్చు. ప్రతిరోజూ 150 మందికి పైగా యాత్రికులకు సేవలు అందిస్తున్నామ‌ని తెలిపారు.