1984 Anti Sikh Riots: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య 1984 అక్టోబరు 31న జరిగింది. ఈ హత్య జరిగిన మరుసటి రోజే (1984 నవంబరు 1న) దేశ రాజధాని ఢిల్లీలో సిక్కులపై(1984 Anti Sikh Riots) దాడులు జరిగాయి. ఎంతోమంది సిక్కులను అల్లరి మూకలు హత్య చేశారు. ఆ రోజున ఢిల్లీలోని ఒక ఏరియాలో జస్వంత్ సింగ్ అనే వ్యక్తితో పాటు అతడి కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ మర్డర్‌లో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ప్రమేయం ఉందని ఢిల్లీలోని ఓ కోర్టు విచారణలో తేలింది. దీంతో ఈనెల (ఫిబ్రవరి) 12వ తేదీనే ఆయనను దోషిగా తేల్చగా.. ఈరోజు శిక్షను ఖరారు చేశారు. సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా తీర్పును వెలువరించారు.
Also Read :Supreme Court: జోగి రమేష్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొద్దు: సుప్రీంకోర్టు
2021 డిసెంబరు 16న అభియోగాలు నమోదు
సజ్జన్ కుమార్ వల్ల హత్యకు గురైన జస్వంత్ భార్య తరఫు న్యాయవాది ఢిల్లీ కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. సజ్జన్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయడం గమనార్హం. 1984 నవంబరు 1న జస్వంత్, తరుణ్‌ల మర్డర్ జరగగా.. 2021 డిసెంబరు 16న సజ్జన్ కుమార్‌పై కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ‘‘1984 నవంబరు 1న జస్వంత్ ఇంటిపై పెద్దసంఖ్యలో అల్లరిమూకలు దాడి చేశారు. ఆ గుంపునకు సజ్జన్ కుమార్ సారథ్యం వహించారు. జస్వంత్ ఇంట్లోని వారిపై దాడి చేసేలా అల్లరి మూకలను సజ్జన్ రెచ్చగొట్టారు’’ అని వాటిలో పేర్కొన్నారు.ఈ కేసులో జస్వంత్ భార్య ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘ న్యాయపోరాటాన్ని కొనసాగించారు.
తిహార్ జైలులోనే సజ్జన్
- కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు.
- 1984 నవంబరు 1, 2 తేదీల్లో ఢిల్లీలోని పాలం కాలనీలో జరిగిన ఐదుగురు సిక్కుల హత్యల కేసులో సజ్జన్ కుమార్ కొన్నేళ్ల క్రితమే దోషిగా తేలారు. దీంతో ఆయనకు ఢిల్లీ హైకోర్టు అప్పట్లో జీవిత ఖైదు శిక్షను విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది ప్రస్తుతం పెండింగ్ దశలో ఉంది.
- సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన సమయంలో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో ప్రభావవంతమైన నేతగా సజ్జన్ వ్యవహరించేవారు.