Mysterious Disease : అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. 2024 డిసెంబరు నుంచి ఇప్పటివరకు జమ్మూకశ్మీరులోని రాజౌరీ జిల్లా బధాల్ గ్రామంలో 38 మంది ఈ ఇన్ఫెక్షన్ సోకింది. వారిలో 16 మంది చనిపోయారు. పీజీఐమర్ సంస్థ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) వంటి సంస్థలు రంగంలోకి దిగినా ఈ ఇన్ఫెక్షన్‌కు కారణమేంటి అనేది తెలుసుకోలేకపోయాయి. ఇవాళ (శనివారం రోజు) బధాల్ గ్రామానికి చెందిన ఓ మహిళలోనూ ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలను గుర్తించారు. ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజౌరీలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ఈనేపథ్యంలో రాజౌరీ జిల్లా వైద్యాధికార యంత్రాంగం హై అలర్ట్ మోడ్‌లో(Mysterious Disease) ఉంది. బధాల్ గ్రామంలోని మూడు కుటుంబాలకు చెందిన వారిలో ఈ ఇన్ఫెక్షన్లు బయటపడినట్లు గుర్తించారు. దీంతో ఆ కుటుంబాలపై పోలీసు సిబ్బంది, వైద్యాధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
Also Read :Trump Swearing In : ఎల్లుండి రోటుండాలో ట్రంప్ ప్రమాణస్వీకారం.. రోటుండాలో ఎందుకు ?
అంతుచిక్కని వ్యాధితో మరింత మంది చనిపోకుండా బధాల్ గ్రామంలో రాజౌరీ జిల్లా వైద్యాధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలను అమలు చేస్తోంది. ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్లు ప్రబలకుండా డిసెంబరు 7 నుంచి పర్యవేక్షిస్తోంది. బధాల్ గ్రామంలోని 4 వార్డుల పరిధిలో ప్రజలకు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ఊరిలోని ఇంటింటికి వెళ్లి ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలకు వైద్య సిబ్బంది కౌన్సెలింగ్ చేస్తున్నారు. మరో 10 రోజుల్లోగా ఈ మిస్టరీ వ్యాధికి సంబంధించిన కారణాలు బయటపడతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. బధాల్ గ్రామం నుంచి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధికార వర్గాలు ఇప్పటికే శాంపిళ్లు సేకరించాయి. జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రతిరోజూ శాంపిళ్లను సేకరించి, వాటిని టెస్టు కోసం పంపుతోంది. కొన్ని రోజుల క్రితం బధాల్‌లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి పలువురు పిల్లలు కోమాలోకి వెళ్లారు. చికిత్సపొందుతూ చనిపోయారు. దీంతో ఈ గ్రామంలోని పిల్లలకు జ్వరాలకు వస్తే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.