110 Heatwave Deaths : ఈ ఏడాది ఎండలు దడ పుట్టించాయి. ప్రత్యేకించి మన దేశంలోని ఉత్తరాది ప్రాంతంలో ప్రజలు ఎండలకు బాగా ప్రభావితమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా వడగాలులకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 18 మధ్యకాలంలో వడదెబ్బకు దేశవ్యాప్తంగా 110 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాదాపు 40వేల మంది వడదెబ్బతో ఆస్పత్రుల్లో చేరారని తెలిపింది. వడదెబ్బతో ఉత్తర్‌ప్రదేశ్‌లో 36 మంది, బిహార్, రాజస్థాన్, ఒడిశాలలో పదుల సంఖ్యలో చనిపోయారని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ)కి చెందిన ‘ఉష్ణోగ్రత ప్రభావిత అనారోగ్యం, మరణాలపై జాతీయ పర్యవేక్షణ విభాగం’ తెలిపింది. ఇది ఆయా రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మాత్రమేనని.. వాస్తవంగా వడదెబ్బ మరణాల సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుందని చెప్పింది. జూన్ 18న ఒక్కరోజే వడదెబ్బకు(110 Heatwave Deaths) ఎనిమిది మంది చనిపోయినట్లు తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
వడదెబ్బ వల్ల జూన్ 11-19 మధ్యలో ఢిల్లీలో 192 మంది మృత్యువాత పడినట్లు ‘సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ (సీహెచ్‌డీ)’ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. అయితే ఈ వివరాలను ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ఒకవేళ ఒక్క ఢిల్లీలోనే ఇన్ని వడదెబ్బ మరణాలు ఉంటే దేశవ్యాప్తంగా ఇంకెన్ని ఉంటాయనేది ఆలోచించాల్సిన విషయం. వడదెబ్బ కారణంగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో 33 మంది చేరగా.. 13 మంది చనిపోయారు. ఒక్కరోజులోనే సఫ్దర్‌జంగ్‌తోపాటు ఆర్‌ఎంఎల్, ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రుల్లో కలిపి 20 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్స అందించడానికి ఆస్పత్రులు ప్రయారిటీ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ఈమేరకు పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. వడదెబ్బ బాధితులు, మరణాల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు అందజేయాలని కేంద్రం కోరింది.
Also Read :Amaravati : అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం – సీఎం చంద్రబాబు
రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
మహారాష్ట్రలోని థానే, పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాల్ఘర్‌లోని సూర్య నది మానేర్‌లోని ఒక వంతెన మునిగిపోయింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పాల్ఘర్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. థానేలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గత 24 గంటల వ్యవధిలో నగరంలో 35.51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి తెలిపారు.