Liver Health: మీ లివర్ సమస్యలో ఉందని ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు..

లివర్‌ సమస్యలను గుర్తించడం కష్టమే. కొన్ని సందర్భాల్లో లివర్‌ సమస్యలు ఉంటే లక్షణాలు (Symptoms) కనిపిస్తూ ఉంటాయి.

లివర్‌ (Liver) మన శరీరంలో 500 పైగా పనులు నిర్వహిస్తుంది. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లవర్‌ ఫిల్టర్‌ చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మనం తీసుకన్న ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాలను సైతం లివర్‌ తొలగిస్తుంది. మన శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్‌ నియంత్రిస్తుంది. మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి లివర్‌ కీలకం. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను లివర్ (Liver) తయారు చేస్తుంది. మన శరీరంలో కీలక అవయవమైన కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. నిజానికి, లివర్‌ సమస్యలను గుర్తించడం కష్టమే. చాలా వరకు 90 శాతం కాలేయం దెబ్బతినేంతవరకు వ్యాధి లక్షణాలు బయటప‌డ‌వు. అయితే, లివర్‌ సమస్యలు ఉంటే.. కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

కడుపులో సమస్యలు

సాధారణంగా, కడుపులో అసౌకర్యం ఉంటే వికారంగా, వాంతి వచ్చేలా ఉంటుంది. కొన్ని సార్లు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. చాలా మంది ఇది కడుపులో అసౌకర్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ, ఈ సమస్య పదేపదే ఇబ్బంది పెడుతుంటే.. మీ లివర్‌లో సమస్య ఉందని అనుమానించాల్సిందే. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.

నోటి దుర్వాసన

నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్కోసారి కాలేయంలో సమస్యలు వచ్చినా నోటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. మీరు నోటి శుభ్రత పాటించినా.. దుర్వాసన సమస్య ఉంటే డాక్టర్‌ను కలవడం మంచిది.

కళ్లు పసుపు పచ్చగా మారితే

కొన్ని వ్యాధుల లక్షణాలు కళ్ల ద్వారానే గుర్తిస్తారు! దీనికి మంచి ఉదాహరణ కామెర్లు, హెపటైటిస్. ఈ సమస్యలు ఉంటే.. కళ్లు పసుపు పచ్చగా మారతాయి. ఒకవేళ.. మీరు నిద్ర లేవగానే కళ్ల రంగు పసుపు రంగులోకి మారితే.. లివర్‌ ప్రాబ్లమ్‌ ఉన్నట్లు అనుమానించాల్సిందే. మీరు వెంటనే‌ డాక్టర్‌ను కలవడం మేలు.

మూత్రం రంగు మారితే

మూత్రం రంగులో మార్పు వచ్చినా.. కిడ్నీ, లివర్‌లో సమస్యలున్నట్లు భావించాలి. ముఖ్యంగా శరీరంలోని మలినాలను తొలగించే కాలేయం సరిగా పనిచేయకపోతే పిత్త రసం, లవణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో పేరుకుపోయి, చివరికి మూత్రవిసర్జన, మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. మీ నీళ్లు సరిగ్గా తాగకపోయినా మూత్రం ముదురు రంగులో ఉంటుంది. ఒకవేళ మీరు సరిపడా నీళ్లు తాగినా.. మీ మూత్రం ముదుర రంగులో ఉంటే లివర్‌ సమస్యలో ఉన్నట్లు అనుమానించాల్సిందే.

చేతులు, కాళ్ల వాపు

కాలేయ సమస్యలు ఉంటే హఠాత్తుగా చేతులు, కాళ్లు వాపు వస్తాయి. లివర్‌ సరిగ్గా పనిచేయకపోయినా, శరీరంలో టాక్సిన్స్‌ పేరుకుపోయినా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి

లివర్‌ను ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన జీవనశైలని పాటించాలని ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డా. శరద్‌ కులకర్ణి అన్నారు. మీ ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, నానబెట్టిన బాదం, ఎర్ర బియ్యం తీసుకోవాలని సూచించారు. ప్రాసెస్ చేసిన ఆహారం, ప్యాకేజ్‌ ఆహారం, స్వీట్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలని అన్నారు.

Also Read:  Heart Failure: యువకుల్లో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించిందిలా